అక్రమ రవాణాకు చెక్
అధికారుల నిరంతర పర్యవేక్షణతో ఇసుక క్వారీ కాంట్రాక్టర్ల బెంబేలు
● ఇసుక అక్రమ రవాణా కట్టడికి నాలుగు చెక్‌పోస్టుల ఏర్పాటు
● వారం రోజుల్లోనే 30 లారీలు సీజ్
● ఇప్పటికే పలు క్వారీల్లో పనుల నిలిపివేత
నిబంధనల మేరకు ఇసుక లోడింగ్ చేయిస్తున్న టీజీఎండీసీ సిబ్బంది
ఏటూరునాగారం: జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న ఇసుక క్వారీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. క్వారీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిబంధనలు కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇసుక లారీల్లో తరలిస్తున్న అధికలోడు, జీరో బిల్లులపై దృష్టి సారించి అధికారులు నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. దీంతో అధికలోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలు చెక్‌పోస్టుల వద్ద పట్టుబడుతున్నాయి. ఎస్పీ శబరీశ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ క్వారీల వద్దకు నేరుగా వెళ్లి స్టాక్ రిజిస్టర్, లోడింగ్, డంపింగ్, వే బిల్లులను పరిశీలిస్తున్నారు. దీంతో ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు జంకుతున్నారు.
నిబంధనలు కఠినతరం..
ఇసుక క్వారీల వద్ద ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేటు, సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలు, లారీలకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అవేకాకుండా అదనపు బకెట్ లేకుండా, కెపాసిటీతో ఉన్న లారీకే వేబిల్లు ఇవ్వడం, ఎక్కువగా ఉన్న ఇసుకను వే బ్రిడ్జి వద్ద తొలగించడం వంటి చర్యలు చేపట్టారు. అలాగే, లోడింగ్‌కు డబ్బులు ఇవ్వకుండా, డబుల్ లారీలు నడపడం వంటివి మూసివేశారు. దీంతో క్వారీ నిర్వహణ ఆర్థికంగా ఆశాజనకంగా లేదని రీచ్‌లోని రేజింగ్ కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారు.
నిరంతరం తనిఖీలు..
జిల్లాలోని ఇసుక లారీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు జిల్లాలో నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కమలాపురం, ఏటూరునాగారం, ఎస్‌ఎస్ తాడ్వాయి, ములుగు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో సంయుక్తంగా 24గంటలు డ్యూటీలను కేటాయించి తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నారు. వారం రోజుల్లో జిల్లాలో ఏటూరునాగారం చెక్‌పోస్టు పరిధిలో 17, కమలాపురం పరిధిలో 5, ములుగు పరిధిలో 8 ఇసుక లారీలను పట్టుకున్నారు. అయితే అధిక లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీల యజమానులకు జరిమానా విధిస్తున్నప్పటికీ వారిలో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఇసుక క్వారీల్లో దందా కొనసాగకపోవడంతో తాము క్వారీలను నడపలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. గత పాలసీని కొనసాగిస్తేనే క్వారీలను నడుపుతామని తేల్చిచెప్పడం గమనార్హం.
నిరంతరం నిఘా
ఇసుక క్వారీలు, రవాణాపై నిరంతరం నిఘా ఉంటుంది. అక్రమంగా ఇసుకను ఎవరు తవ్వినా, తరలించినా శాఖా పరమైన కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. నిబంధనల ప్రకారం క్వారీలను నడపాలి. 24గంటల పాటు నిఘా వేసి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటాం.
– శివం ఉపాధ్యాయ, ఏటూరునాగారం, ఏఎస్పీ
జిల్లాలోని ఇసుక క్వారీల పరిస్థితి ఇలా..
వాజేడు మండల పరిధిలోని అయ్యవారిపేట, భీమారం, ధర్మారం క్వారీలను కాంట్రాక్టర్లు మూసివేశారు.
వెంకటాపురం(కె) మండల పరిధిలోని ఆలుబాక, చొక్కాల క్వారీల డీడీలను ఆన్‌లైన్‌లో పెట్టడం నిలిపివేశారు.
మంగపేట మండల పరిధిలోని ఐదు క్వారీలకు ఒక క్వారీ వద్ద ఇసుక పోయడం నిలిపివేశారు.
ఏటూరునాగారంలోని మానసపల్లి–1, 2 క్వారీల్లో ఇసుకు తవ్వకాల పనులు సాగడం లేదు.
అక్రమ రవాణాకు చెక్
అక్రమ రవాణాకు చెక్
అక్రమ రవాణాకు చెక్
Comments
Please login to add a commentAdd a comment