విద్యార్థుల అభ్యున్నతికి హెచ్‌ఎంలు కృషిచేయాలి
ములుగు: విద్యార్థుల అభ్యున్నతికి ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు డీఈఓ పాణిని అధ్యక్షతన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యాశాఖను బలోపేతం చేయడానికి హెచ్‌ఎంలు కీలక పాత్రను పోషించాలన్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించి ప్రత్యేక బోధన అందించాలన్నారు. వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. డేటా క్యాప్చర్ అతంటికేషన్ ఫాంలో హెచ్‌ఎంలు యూడైస్‌లో సరైన సమాచారాన్ని నింపితే పాఠశాల అవసరాలకు అవసరమైన ప్రభుత్వ నిధులు ముంజూరయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. ఉన్నతాధికారులు అడిగే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పాఠశాలల వారీగా రికార్డులను విధిగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. ఎప్‌ఎల్‌ఎన్, లిప్ కార్యక్రమంలో 40శాతం బోధన ద్వారా, 60శాతం విద్యార్థులకు ప్రాక్టీస్ ద్వారా సాధన చేయించాలన్నారు. రోజువారీగా ఎంతమంది విద్యార్థులు హాజరయ్యేది, వారి కోసం వడ్డించే మధ్యాహ్న భోజన వివరాలను ఉదయం 11గంటల వరకు యాప్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ప్రతీ విద్యార్థికి అపార్ ఐడీ జనరేట్ చేసి అందించాలన్నారు. పాఠశాలలు, కాంప్లెక్స్, ఎంఆర్సీలకు విడుదల చేసిన నిధులను నిబంధనల మేరకు ఖర్చు చేసి రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. మౌలిక వసతుల కల్పనపై సరైన వివరాలను ఆన్‌లైన్ చేయాలన్నారు. 10వ తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలో ఈ దఫా రెండు పరీక్షలకు ఓఎంఆర్ షీట్‌లను అందిస్తున్నామని తెలిపారు. వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాలు వచ్చేలా పదో తరగతి విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ పాణిని, డీసీఈబీ సెక్రటరీ సూర్యనారాయణ, సమగ్రశిక్ష కోఆర్డినేటర్లు రాజు, మల్లారెడ్డి, రమాదేవి, సాంబయ్య, సైకం శ్రీనివాస్‌రెడ్డి, ఏసీజీఈ అప్పని జయదేవ్, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment