గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి
ములుగు: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో వారంలో ఒకరోజు గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేయాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మాతృ మరణాలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్స్, సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఫార్మసిస్టులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గర్భిణులకు సకాలంలో చికిత్సలను అందిస్తూ పోషకాహార ప్రాముఖ్యతను వివరించాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. ఎనిమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో ఆరు నెలల నుంచి 59నెలల మధ్య పిల్లలకు ఐరన్, ఫోలిక్ సిరప్, పింక్ బ్ల్యూ, రెడ్ ఐరన్ మాత్రలను అందించాలన్నారు. అసంక్రమిత వ్యాధులు బీపీ, షుగర్, క్యాన్సర్‌లపై ఈ నెల చివరి వారం వరకు స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తక్కువ పనితీరును కనబర్చిన కేంద్రాలు ఇకపై పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. టీబీ కేసులను ఎప్పటికప్పుడు నిర్ధారించి చికిత్స అందించాలన్నారు. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై పీహెచ్‌సీలు, సబ్ సెంటర్‌ల వారీగా ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్, ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, ప్రోగ్రాం అధికారులు శ్రీకాంత్, పవన్‌కుమార్, చంద్రకాంత్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment