జలుబు, నిమ్ముతో పసికందు మృతి
● ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమని తల్లిదండ్రుల ఆరోపణ
వాజేడు: దగ్గు, జలుబు, నిమ్ముతో ఇబ్బంది పడుతున్న పసికందుకు ఆస్పత్రి సిబ్బంది వ్యాక్సిన్ ఇవ్వకపోవడంతో మృతి చెందినట్లు బాధిత తల్లిదండ్రులు గోగు బాలకృష్ణ, భారతి తెలిపారు. మండల పరిధి గుడిసెల కాలనీలో ఆదివారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గోగు బాలకృష్ణ, భారతి దంపతుల స్వగ్రామం చండ్రుపట్ల. వీరికి మూడో సంతానమైన కూతురుకు(55 రోజులు) దగ్గు, జలుబుతో పాటు నిమ్ము చేరగా వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. శిశువుకు 45 రోజులకు వేయాల్సిన వ్యాక్సిన్ ఇవ్వకుండా వారం తర్వాత రమ్మని చెప్పగా తిరిగివెళ్లిపోయారు. అప్పటికే నిమ్ము ఎక్కువైంది. దీంతో ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షలు చేసిన వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్థానిక ఆర్‌ఎంపీకి చూపించగా సిరప్ ఇచ్చి పంపించాడు. అయినా పసికందు ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆదివారం వాజేడు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యాధికారి మధుకర్ తెలిపారు. ఈ విషయంపై ఆయనను వివరణ కోరగా వారం రోజుల ముందు ఇక్కడికి వచ్చారని, ఆ సమయంలో పాపకు నిమ్ము ఎక్కువ ఉండడంతో ప్రథమ చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ అందక పాప మృతి చెందలేదని, వ్యాధుల ముందస్తు నివారణకు వ్యాక్సిన్ వేస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment