ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ములుగు: రేపటి నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి చంద్రకళతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3,793 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా వారి కోసం 10కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. పరీక్షల సమయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని ట్రాన్‌కో అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టు పక్కల 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు తెరుచుకోకుండా చూడాలన్నారు. తాగునీటి విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. వైద్యారోగ్య శాఖ తరఫున ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు విధులు నిర్వహించడంతో పాటు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటారని కలెక్టర్ వివరించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment