రామప్ప ఒగరుకాల్వకు బుంగ
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప సరస్సు ప్రధాన కాల్వ ఒగరుకాల్వకు అదివారం రాత్రి బుంగపడింది. ప్రధాన తూము సమీపంలోనే బుంగపడి పక్కనే ఉన్న పంటపొలాల్లోకి నీరంతా చేరడంతో కొంతమేర మునిగిపోయాయి. సమాచారం తెలుసుకున్న నీటి పారుదల శాఖ ఈఈ నారాయణ, డీఈ రవీందర్‌రెడ్డి, ఏఈ జయంతిలు బుంగ పడిన ప్రదేశాన్ని సోమవారం పరిశీలించారు. ఈ క్రమంలో ఒగరుకాల్వకు నీటి సరఫరాను నిలిపివేశారు. తొందరలోనే బుంగ పడిన ప్రదేశానికి మరమ్మతులు చేపట్టి కాల్వ ద్వారా ఆయకట్టు పంట పొలా లకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు.
పాఠశాలలో డిజిటల్
ప్రొజెక్టర్ ఏర్పాటు
ఎస్‌ఎస్ తాడ్వాయి: మండల పరిధిలోని కొండపర్తి ఎంపీపీఎస్ పాఠశాలలోని తరగతి గదిలో డిజిటల్ ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. మారుమూల గిరిజన గ్రామంలో గిరిజనులకు నాణ్యమైన ఇంగ్లిష్ విద్యను అందించాలనే సంకల్పంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత గ్రామం కావడంతో పాఠశాలలో ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. నేడు (మంగళవారం) ఈ డిజిటల్ ప్రొజెక్టర్‌ను గవర్నర్ ఆవిష్కరించనున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.
వీరవనిత
సావిత్రిబాయి పూలే
ములుగు: మహిళలను చైతన్యపరిచిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట సోమవారం సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా, సామాజిక కార్యకర్తగా, సంఘ సేవకురాలిగా ఆమె పనిచేశారని తెలిపారు. సమాజంలోని మూఢనమ్మకాలపై నిరంతరం పోరాటం చేశారని ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జన్ను రవి, పౌడాల ఓం ప్రకాశ్, ఎండీ అహ్మద్‌పాషా, ఓరుగంటి అనిల్, గందె రాజు, గందె మధు, గాజె రాజు, మాదారపు రాజు, షర్పోద్ధీన్, నరేష్, పైడిమల్ల భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటి చుట్టూ ఉచ్చుతీగలు
కాటారం: మండలంలోని గూడూరులో ఓ ఇంటి చుట్టూ వన్యప్రాణుల వేటకు ఉపయోగించే ఉచ్చు తీగలను పలువురు గుర్తు తెలియని దుండగులు అమర్చిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సదాశివ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి రాత్రి వచ్చి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసే సరికి ఇంటి ముందు ఉచ్చు తీగ అమర్చి సమీపంలోని విద్యుత్ స్తంభానికి తీగలను తగిలించి ఉంది. ఆ స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై–2 శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎవరైనా హత్యాయత్నానికి ప్రయత్నించారా, లేక గ్రామ శివారులో ఉండటంతో వన్యప్రాణుల వేట కోసం ఉచ్చుతీగ బిగించి ఉంటారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
రామప్ప ఒగరుకాల్వకు బుంగ
రామప్ప ఒగరుకాల్వకు బుంగ
Comments
Please login to add a commentAdd a comment