
అక్రమంగా మట్టి తవ్వకాలు
కాటారం: మహాముత్తారం మండలం యామన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డగూడెం సమీపంలోని ఎర్రకుంట చెరువులో ఆదివారం అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయి. కొందరు వ్యక్తులు జేసీబీ సహాయంతో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి రవాణా చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. ఇరిగేషన్ శాఖకు చెందిన చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత శాఖ అధికారుల నుంచి స్పందన లేదు. అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి దందా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.