
‘భూభారతి’పై అవగాహన కల్పించాలి
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై పైలట్ మండలంగా ఎంపికై న వెంకటాపురం(ఎం) మండలంలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్‌తో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి భూ భారతి కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ రూప కల్పన చేయాలన్నారు. అవగాహన సదస్సులకు ఎక్కువ మంది రైతులు హాజరయ్యేలా చూడాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు విధుల నుంచి తొలగించనున్నట్లు వెల్లడించారు. భూభారతి విధివిధానాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ పలు అంశాలను వెల్లడించారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన భూభారతి పోర్టల్‌కు గతంలోని ధరణి పోర్టల్‌కు చాలా తేడా ఉందని, భూముల విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగవద్దని ఉద్దేశంతో ప్రభుత్వం మరో 14అంశాలను పొందుపరిచిందని తెలిపారు.భూముల విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఏడాదిలో పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. భూమి విలువ రూ.5లక్షల లోపు ఉంటే ఆర్డీఓ స్థాయి, రూ.5లక్షలకు పైగా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉందని తెలిపారు. ఇక నుంచి పరిశీలించిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగిస్తారని తెలిపారు. మే 1నుంచి 31వరకు పరిశీలన చేసిన అనంతరం జూన్ 2నుంచి పట్టాలు అందిస్తామని వివరించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర