
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
వెంకటాపురం(ఎం)/ఎస్‌ఎస్‌తాడ్వాయి: భూ భారతి చట్టంతోనే భూ సమస్యలకు తగిన పరిష్కార మార్గం లభిస్తుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్, ప్రత్యేక అధికారి కిరణ్ ప్రకాశ్‌తో కలిసి గురువారం మండల పరిధిలోని నర్సాపూర్‌లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలన్నారు. భూ భారతి చట్టం ప్రకారం వివరాలు సేకరించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వివరించారు. దరఖాస్తుల స్వీకరణ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యలు పరిష్కారం అనంతరం పూర్తి స్థాయి రికార్డులను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఈ సదస్సులో భాగంగా నాలుగు కౌంటర్‌లు ఏర్పాటు చేయగా సమస్యలు పరిష్కారించాలని మొత్తం 650 వినతులు అందాయి. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. అదే విధంగా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రతీ మండలంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఏ అధికారి ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి.. అది పరిష్కారం కాకుంటే ఎవరికీ అప్పీల్ చేయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని వివరించారు. భూ భారతి పోర్టల్‌లో ఎకరం భూమి మ్యూటేషన్ దరఖాస్తుతో పాటు వారసత్వ ఒప్పంద పత్రం.. నిర్ధేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం జత చేయాలన్నారు. ఈ దరఖాస్తులపై తహసీల్దార్ 30రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ తహసీల్దార్ సురేష్‌బాబు, ఎంపీడీఓ సుమనవాణి, అధికారులు పాల్గొన్నారు.
నేటి సదస్సుకు మంత్రుల రాక
పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలో నేడు నిర్వహించనున్న భూ భారతి రెవవెన్యూ సదస్సుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు రానున్న తరుణంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేస్తున్న ఏర్పాట్లను గురువారం కలెక్టర్ దివాకర పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ఆయన వెంట రెవెన్యూ సదస్సుల ఇన్‌చార్జ్ కిరణ్‌ప్రకాశ్, ఆర్డీఓ నలువాల వెంకటేశ్, ఎంపీడీఓ రాజు, తహసీల్దార్ గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర