
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి
ములుగు: వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలో శిశువు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండారుపల్లికి చెందిన బిల్ల రవళి గురువారం ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. మొదట వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేస్తామన్నారు. తదనంతరం సాధారణ ప్రసవానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వైద్యులు ప్రసవానికి ప్రయత్నించే సమయంలో గర్భంలోనే మగ శిశువు మృతిచెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు జాతీయరహదారిపై ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో రెవెన్యూ సదస్సుకు హాజరుకావడానికి వచ్చిన మంత్రులు ఈ రహదారి గుండా వెంటాపురం(ఎం) మండలకేంద్రానికి వెళ్లాల్సి ఉంది. దీంతో అప్రమత్తమయిన పోలీసులు ఆందోళన కార్యక్రమాన్ని నిలువరించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క బాధ్యులపై చర్య తీసుకుంటామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే బాలింత పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు అన్నారు. స్థానికంగా డెలివరీ కాకపోతే వేరే ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పినా వైద్యులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు.
జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన
బాధ్యులపై చర్య తీసుకుంటామన్న
మంత్రి సీతక్క

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి