
ఆధార్ తరహాలో భూదార్ సంఖ్య
ములుగు/గోవిందరావుపేట: భూ భారతి చట్టంలో ఆధార్ తరహాలో భూదార్ సంఖ్య కేటాయిస్తామని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరుచుకోవాలన్నారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా జిల్లాకేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో, గోవిందరావుపేట మండలకేంద్రంలోని రైతు వేదికలో శనివారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందన్నారు. భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలంలోపు భూ భారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుల అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి ఆర్జీలు స్వీకరిస్తారని అన్నారు. సమస్యలను నిర్ధిష్ణ గడువులోపు పరిష్కరించనున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్‌కు లేదా సీసీఎల్‌ఏకు అప్పిల్ చేసుకోవచ్చని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలవడనున్నాయని అన్నారు. ప్రతిగ్రామంలో రెవెన్యూ రికార్డులను తయారుచేసి ప్రతి ఏడాది గ్రామాలలో డిస్‌ప్లే చేస్తామని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతిగ్రామంలో పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజ్, తహసీల్దార్ విజయభాస్కర్, సృజన్‌కుమార్, ఎంపీడీఓ రామకృష్ణ, జవహర్‌రెడ్డి, ఆర్.యుగేందర్‌రెడ్డి, గోవిందరావుపేట మండల వ్యవసాయ అధికారి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
అకాల వర్షాలు కురిసే అవకాశం
వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో ఆదివారం(నేడు), సోమవారం అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ టీఎస్ దివాకర శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు, ధాన్యం కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం తడవకుండా రాసులపై టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచాలని సూచించారు.
భూ భారతిపై అవగాహన ఉండాలి
కలెక్టర్ టీఎస్ దివాకర