
మొక్కజొన్న పంట దగ్ధం
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఆరబెట్టిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన కరాబు రాజు నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వానాకాలం పత్తి పంటను సాగుచేయగా అధిక వర్షాలకు దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. దీంతో పత్తి పంటను తొలగించి నాలుగు ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోత కోసి ఆరేందుకు పొలంలోనే ఉంచాడు. బుధవారం ప్రమాదవశాత్తు పంటకు నిప్పు అంటుకుంది. ఇతర రైతులు గమనించి రాజుకు సమాచారం అందించారు. రైతులంతా కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. ఫలితంలేకుండాపోయింది. నాలుగు ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.4 లక్షల పంట నష్టం జరిగిందని రైతు వాపోయాడు. అలాగే మరో రైతు కృష్ణకు చెందిన రెండు ఎకరాలల్లోని మొక్కజొన్న పంట కోసి పొలంలో ఆరబెట్టగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.