
పిల్లల ఎదుగుదలపై శ్రద్ధ చూపాలి
ములుగు: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై అంగన్‌వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా సంక్షేమ అధికారి శిరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో శుక్రవారం సమగ్ర శిశు అభివృద్ధి అధికారులు, సూపర్‌వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బందితో జిల్లా సంక్షేమ అధికారి కె.శిరీష పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఏఎం, ఎంఏఎం (లోప పోషణ) పిల్లల పెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి చిన్నారులను పరిశీలించి ఎస్‌ఏఎం, ఎంఏఎ లోపం లేదని నిర్ధారించుకోవాలన్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణం, కేంద్రాల్లో తాగునీటి సరఫరాతో పాటు తదితర అంశాలపై సీడీపీఓలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం ద్వారా 18 అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు కలెక్టర్ మంజూరు చేయగా పనుల వివరాలపై చర్చించినట్లు తెలిపారు. సొంత, అద్దె భవనాలు శిథిలావస్థలో ఉంటే వెంటనే మార్చాలని సూచించారు. అంగన్‌వాడీలు మొబైల్ అప్లికేషన్‌లో డేటా అప్డేట్ చేసే విధంగా ఎప్పటికప్పడు సీడీపీఓలు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సీడీపీఓ ప్రేమలత, ఎస్‌ఎస్‌తాడ్వాయి సీడీపీఓ విజయ, ఉమ్మడి జిల్లా ఐటీ సమన్వయ కర్త మహేష్, పోషణ్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ మమత, బ్లాక్ కో ఆర్డినేటర్లు వెంకట్, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.