మాట్లాడుతున్న కలెక్టర్ ఉదయ్‌కుమార్
నాగర్‌కర్నూల్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ సజావుగా చేపట్టాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆదేశించారు. శనివారం ఉదయం నూతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ మనోహర్‌తో కలిసి సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్‌ల గుర్తింపుపై స్టేషన్ హౌజ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 760 పోలింగ్‌స్టేషన్లు ఉండగా.. వీటిలో సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్ ఎన్ని ఉన్నాయి.. అందుకు గల కారణాలను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
2018 అసెంబ్లీ ఎన్నికలను ప్రామాణికంగా చేసుకోవాలని సూచించారు. గొడవలు జరిగిన పోలింగ్ స్టేషన్, క్రిమినల్ కేసులు ఎక్కువగా నమోదైన పోలింగ్ స్టేషన్, రెండు పొలిటికల్ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ ఉన్న ప్రాంతం, కుల, మత విభేదాలు ఎక్కువగా ఉన్న పోలింగ్‌స్టేషన్, 80 శాతం కన్నా అధికంగా పోల్ అయినవి లేదా 70 శాతం ఓట్లు ఒకే అభ్యర్థికి పోల్ అయిన పోలింగ్‌స్టేషన్.. ఏ నియోజకవర్గంలో వస్తుంది అనే పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు. లైసెన్స్ పొందిన మారణాయుధాలు ఎవరి దగ్గర ఉన్నాయో గుర్తించి తిరిగి జమ చేసుకోవాలని చెప్పారు.
ఎస్పీ మాట్లాడుతూ 2018 ఎన్నికల రోజున ఏదైనా పోలింగ్‌స్టేషన్‌లో గొడవ జరిగి ఉంటే దానిని సైతం సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌గా గుర్తించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గొడవలు జరిగే ప్రమాదం ఉందా.. లేదా.. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందా.. అని భావిస్తే పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు మోహన్‌కుమార్, గిరిబాబు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ జాకీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment