మహిళా సంఘాల బలోపేతానికి కృషి
వెల్దండ: జిల్లాలో మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేక దృష్టిపెట్టామని డీపీఎం ఐబీ శ్రీనివాసులు అన్నారు. శనివారం మండల మహిళా సమాఖ్య కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 1,46,916 మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, ప్రతి సంఘానికి బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలన్నారు. గ్రామాల్లో కొత్తగా మహిళా సంఘాల ఏర్పాటు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. వీఓఏలు గ్రామాల్లో కొత్త సంఘాలను ఏర్పాటు చేసి సభ్యులను ప్రోత్సహించాలన్నారు. గ్రామ సంఘాల్లోని మహిళలకు జీవనోపాధి కోసం పాడి పరిశ్రమ, కిరాణ షాపులు, మిర్చి, పిండి గిర్నిలు, చికెన్ షాపులు, ఇతర పరిశ్రమల కోసం రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు. సంఘాల పనితీరును బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు పొందవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను గ్రామీణ ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన లోకాప్ యాప్‌లో సంఘాలు చేర్చుతున్నామని, ఎస్‌ఎస్‌జీ యాప్‌లోని సంఘాల లావాదేవీలను నిక్షిప్తం చేస్తుందన్నారు. లోకాస్ యాప్ ద్వారా కేంద్రం మహిళా సంఘం పనితీరును బట్టి ప్రత్యేకంగా రుణాలు అందిస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 8,799 సంఘాలు లోకాస్ యాప్‌లో చేరాయన్నారు. మహిళా సంఘాల సభ్యులకు మరింత సమాచారం అందించడానికి జిల్లావ్యాప్తంగా 15 బృందాలతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల మహిళా సంఘం అధ్యక్షురాలు భారతమ్మ, ఏపీఎం ఈశ్వర్, సీసీ యాదగిరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment