అచ్చంపేట మున్సిపల్ భవనం పరిశీలన
అచ్చంపేట: పట్టణంలో మున్సిపల్ నూతన భవనాన్ని మంగళవారం మున్సిపల్ ప్రజా ఆరోగ్య శాఖ ఎస్‌ఈ, ఈఈ, డీఈలు పరిశీలించారు. రూ.3 కోట్లతో నిర్మిస్తున్న ఈ భవనం దాదాపు పూర్తికావొచ్చింది. ఏప్రిల్‌లో భవనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించడంతో పనులు చురుకుగా సాగుతున్నాయి. అదేవిధంగా రూ.10 కోట్లతో చేపట్టనున్న రాజీవ్ ఎన్టీఆర్ మినీ స్టేడియం, రూ.2 కోట్లతో చేపట్టనున్న ఇండోర్ స్టేడియాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ చిన్నారెడ్డి, ఈఈ విజయ్‌భాస్కర్‌రెడ్డి, డీఈ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, కమిషనర్ యాదయ్య, ఏఈలు షబ్బీర్, రాజానాయక్, కాంట్రాక్టర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించాలి
ఉప్పునుంతల: రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ ద్వారా మండలంలో రైతులకు ఇచ్చిన విత్తన వేరుశనగ ద్వారా వచ్చిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మంగళవారం స్థానిక గోడౌన్ వద్దకు వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్ సంధ్యారాణి, ఏఏఓ ఝాన్సీలను రైతులు కలిసి వారి ద్వారా రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌లో సాగుచేసిన వేరుశనగ పంటకు వైరస్ తెగుళ్లు సోకి పంట దిగుబడి పూర్తిగా తగ్టిపోయిందని వారు పేర్కొన్నారు. దీంతోపాటు సంస్థ ద్వారా అందించిన టీసీజీఎస్ 1694 రకం వేరుశనగ విత్తనంలో 15 శాతం కల్తీ విత్తనాలు రావడంతో పంట నష్టపోవాల్సి వచ్చిందన్నారు. దీంతోపాటు బైబ్యాక్ తీసుకునే వేరుశనగ పంటకు సంబంధించిన డబ్బులను మూడు విడతల్లో కాకుండా నెల వ్యవధిలోనే రెండు విడతలలో చెల్లించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు, రైతు అనంతరెడ్డి, రైతులు జంగయ్య, వెంకటయ్య, వెంకటేష్, సైదులు తదితరులున్నారు.
కార్యకర్తల బాగు కోసం పనిచేస్తా : ఎమ్మెల్యే
నాగర్‌కర్నూల్: తాను ఎమ్మల్యేగా గెలుపొందేందుకు కృషి చేసిన కార్యకర్తల బాగు కోసం ఎల్లవేళలా పనిచేస్తానని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బిజినేపల్లి మండల కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేశారని అన్నారు. గత ప్రభుత్వంలో మన నాయకులు, కార్యకర్తలను ఎన్నో రకాలుగా ప్రలోభాలకు, ఇబ్బందులకు గురిచేసినా.. కేసులు పెట్టినా ధైర్యంగా ముందుండి పార్టీని, తనను నడిపించారన్నారు. నన్ను గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఆపదలో అండగా ఉంటానని, వారి కుటుంబ బాగోగుల కోసం ఎల్లవేళలా పనిచేస్తానన్నారు. మన ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేస్తుందని, ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలని కోరారు. అలాగే రైతు రుణమాఫీలో భాగంగా ఒక్క బిజినేపల్లి మండలానికే రూ.60 కోట్లు వెచ్చించారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అచ్చంపేట మున్సిపల్ భవనం పరిశీలన
అచ్చంపేట మున్సిపల్ భవనం పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment