సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి
మన్ననూర్: పరీక్షల సమయంలో విద్యార్థులు సోషల్ మీడియా, టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లోని పీటీజీ పాఠశాల/ కళాశాలను కలెక్టర్ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల నిర్వహణ, మెనూ పాటిస్తున్న విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కామన్ ఫుడ్ మెనూను అనుసరిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలని సూచించారు. ముఖ్యంగా రానున్న వార్షిక పరీక్షల్లో పదో తరగతి విద్యార్థులు 10/ 10 గ్రేడ్ సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి రాత్రి భోజనం చేసిన ఆయన స్టడీ అవర్స్ పరిశీలించిన అనంతరం డార్మెంటరీలో విద్యార్థులతో కలిసి బస చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ పద్మావతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment