నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం శనివారం నుంచి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా మైనర్లు వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టుబడితే కేసు నమోదు చేయడంతోపాటు తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అలాగే నంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్లపైకి తీసుకువస్తే సీజ్ చేస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు.
నాసిరకం సరుకులతో మధ్యాహ్న భోజనం
బిజినేపల్లి: మండలంలోని పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమకు మధ్యాహ్నం అందించే భోజనం నాణ్యతగా లేదని, ప్రశ్నించిన తమను వంట ఏజెన్సీ మహిళలు దుర్భాషలాడుతున్నారని గురువారం ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట కోసం నాసిరకం సరుకులు ఉపయోగిస్తున్నారని, దీంతో ప్రతిరోజు మధ్యాహ్నం సరిగా భోజనం తినలేకపోతున్నామని అధికారుల ఎదుట వాపోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తహసీల్దార్ శ్రీరాములు, ఎంఈఓ రఘునందన్‌రావు నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని, ప్రస్తుతానికి వంట ఏజెన్సీని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై మహిళా సంఘాల సహకారంతో శుక్రవారం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, భోజన నాణ్యతపై ఉపాధ్యాయులు కూడా దృష్టిపెట్టాలని సూచించారు. విద్యార్థుల నుంచి ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వంట ఏజెన్సీ సిబ్బంది కూడా స్వచ్ఛందంగా తప్పుకుంటామని అధికారులతో చెప్పారు. దీంతో విద్యార్థులు తమ తరగతి గదులకు వెళ్లిపోయారు. కాగా నూతన ఏజెన్సీని తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment