తిలా పాపం.. తలా పిడికెడు!
అక్రమ నిర్మాణాల్లో అధికారులే సూత్రధారులు?
●
నాగర్‌కర్నూల్: తెలకపల్లి మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అధికారులు కీలక సూత్రధారులుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకుల ఆజ్ఞ మేరకు అక్రమ నిర్మాణాల నుంచి విద్యుత్ మీటర్ల మంజూరు వరకు సహకారం అందించినట్లు తేటతెల్లమవుతోంది. బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకుండా.. దగ్గరుండి అక్రమ నిర్మాణాలను పూర్తి చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆక్రమణదారులకు దన్ను..
తెలకపల్లిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కళ్లు మూసుకున్న అధికారులు.. సదరు భూమికి తామే వారసులమంటూ బాధితులు ఆ భూమిలో తడకలు వేసుకుంటే మాత్రం రాత్రికి రాత్రే స్పందించారు. పోలీసులు, గ్రామపంచాయతీ అధికారులు సంయుక్తంగా వెళ్లి తడకలను తొలగించారు. మరోసారి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బాధితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే దీన్ని వెనక రాజకీయ నాయకుల హస్తం ఉండటంతో అధికారుల వ్యవహార శైలి ఇలా ఉందనే విమర్శలు ఉన్నాయి. దుకాణాలను నిర్మించుకున్న వ్యక్తులు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండానే..
తెలకపల్లిలోని వివాదాస్పద భూమిలో అక్రమంగా నిర్మించిన దుకాణాల్లో ప్రస్తుతం వివిధ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఏదైన వ్యాపారం కొనసాగాలంటే కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇందుకు దుకాణానికి సంబంధించిన అన్ని అనుమతులు ఉండాలి. కానీ అక్కడ నిర్మించిన ఏ ఒక్క దుకాణానికి అనుమతులు లేవు. దీంతో ట్రేడ్ లైసెన్స్ లేకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రతి సంవత్సరం రూ. 1.50లక్షల వరకు గ్రాపంచాయతీ ఆదాయాన్ని కోల్పోతోంది. దీంతో పాటు అప్పటి విద్యుత్ అధికారులు అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్దంగా విద్యుత్ మీటర్లను ఇచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ట్రేడ్ లైసెన్స్‌లు లేవు..
తెలకపల్లిలోని సర్వే నంబర్ 497లో నిర్మించిన దుకాణాలకు అనుమతులు లేకపోవడంతో పాటు ట్రేడ్ లైసెన్స్‌లు కూడా లేవు. ట్రేడ్ లైసెన్స్‌లు ఉంటే సంవత్సరానికి రూ. 1.20లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండానే వ్యాపారాలు కొనసాగుతున్నాయి. నేను ఈఓగా బాధ్యతలు చేపట్టక ముందే ఈ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.
– భాస్కర్, ఈఓ, తెలకపల్లి
ఉన్నతాధికారికి ఫిర్యాదు
చేశాకే కదలిక..
అక్రమ నిర్మాణాల విషయంలో బాధితులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గతేడాది ఆగస్టు 12న ఫిర్యాదు చేఽశారు. ఈ మేరకు అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి.. రిపోర్టు అందజేయాలని కమిషనర్ ఆదేశిస్తే గాని జిల్లా అధికార యంత్రాంగం కదలలేదు. విచారణ పూర్తి చేశామని.. సదరు నిర్మాణాలకు అనుమతులు లేవని చెబుతున్న అధికారులు.. ఇప్పటికై నా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.
అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసిన
ఆక్రమణదారులు
రూ.లక్షల్లో చేతులు మారినట్లు ఆరోపణలు
ఉన్నతాధికారులకు ఫిర్యాదు తర్వాతే
అధికారుల్లో చలనం
తిలా పాపం.. తలా పిడికెడు!
Comments
Please login to add a commentAdd a comment