ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన
కోడేరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని జిల్లా హౌసింగ్ పీడీ సంగప్ప అన్నారు. శుక్రవారం మండలంలోని పస్పుల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించే స్థలం వెడల్పు 18 ఫీట్లు, పొడవు 22 ఫీట్లు ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కురుమూర్తి, రాజవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ లక్ష్యాలను
సాధించాలి
కందనూలు: ఉపాధి హామీ పథకం లక్ష్యాలను మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని అడిషనల్ డీఆర్డీఓ రాజేశ్వరి అన్నారు. ఉపాధి హామీ కూలీలకు కల్పించాల్సిన పనిదినాలు, పని ప్రదేశాల్లో వసతులు, నర్సరీల నిర్వహణ తదితర అంశాలపై శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీఆర్డీఓ మాట్లాడుతూ.. 2024–25లో గ్రామపంచాయతీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి పెంచాలన్నారు. మొక్కల పరిరక్షణ కోసం క్రమం తప్పకుండా నీటిని అందించాలని ఆదేశించారు. శనివారం సాయంత్రంలోగా ఉపాధి హామీ మెటీరియల్ బిల్లుల వివరాలు అందించడంతో పాటు మంజూరు చేసిన పనులను వందశాతం పూర్తి చేయాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. 2025–26 సంవత్సరానికి పండ్ల తోటలు పెంపకం లబ్ధిదారులను గుర్తించాలని.. ఈత ప్లాంటేషన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని తెలిపారు. సమావేశంలో ఏపీడీ శ్రీను, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment