అమ్మకడుపు చల్లగా..
స్థాయి పెరిగితే..
కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 50 పడకల స్థాయి నుంచి 100 పడకల ఆస్పత్రిగా మారుస్తామని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పాలకులు మారుతున్నారే తప్ప.. ఆస్పత్రి స్థాయి మాత్రం పెరగడం లేదని ప్రజలు వాపోతున్నారు. 100 పడకల ఆస్పత్రి కోసం రెండేళ్ల క్రితం అప్పటి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేసినా.. అందుకు సంబంధించిన పనులు నేటి వరకు ప్రారంభం కాలేదు. ఆస్పత్రి స్థాయి పెరిగితే అధునాతన పరికరాలు, అదనంగా వైద్యులు, సిబ్బంది, ఇతర వసతులు అందుబాటులోకి రావడంతో పాటు సామాన్య ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా ఉంటుందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి ఆస్పత్రి స్థాయిని పెంచేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కల్వకుర్తి సీహెచ్‌సీలో పెరిగిన సాధారణ ప్రసవాలు
● ఆరు నెలల్లోనే 541 కాన్పులు
● మరో 361 సిజేరియన్లు
● ఆస్పత్రి స్థాయి పెరిగితే మరిన్ని సేవలు
అందే అవకాశం
కల్వకుర్తి టౌన్: నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వసతులు మెరుగు పడుతున్నాయి. గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేయించుకోవాలంటే వణికే ప్రజలు.. నేడు సర్కారు దవాఖానల్లో కాన్పు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రోజురోజుకూ కాన్పుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రిలో ఉన్న వైద్యుల సలహాలు, సూచనలతో గర్భిణులు ధైర్యంగా సాధారణ కాన్పు చేయించుకుంటున్నారు. కాన్పు పూర్తయిన తర్వాత తల్లీబిడ్డ ఆరోగ్యంపై వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతుండటంతో గర్భిణులు కాన్పు కోసం క్యూ కడుతున్నారు. ప్రతినెలా గైనకాలజీ వైద్యులతో పరీక్షలు చేయించుకుంటూ.. వారి సూచనలు, సలహాలు పాటిస్తున్నారు. అయితే సాధారణ ప్రసవాలను చేయడంలో కల్వకుర్తి సీహెచ్‌సీ రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచింది. గతంలో ఇక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువగా ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేసేవారు. అయితే ఆస్పత్రిలో అధునాతన పరికరాలతో పాటు గైనకాలజీ వైద్యులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంక్ అందుబాటులో ఉండటంతో సాధారణ ప్రసవాలతో పాటు సిజేరియన్లు సైతం ఇక్కడే చేస్తున్నారు.
ఆరు నెలల్లో 902 కాన్పులు..
సీహెచ్‌సీలో ప్రతినెలా దాదాపుగా 75 వరకు సాధారణ కాన్పులు అవుతున్నాయి. మరో 50 వరకు సిజేరియన్లు జరుగుతున్నాయి. గతనెల ఒకే రోజు 11 సాధారణ కాన్పులు జరిగాయి. ఆస్పత్రి వైద్యులతో పాటు నర్సింగ్, ఇతర సిబ్బంది సమన్వయంతోనే పెద్ద మొత్తంలో కాన్పులు చేయగలుగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా గైనకాలజీ వైద్యులు సకాలంలో అందుబాటులో ఉండటంతోనే కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు. గత ఆగస్టు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆస్పత్రిలో 902 కాన్పులు చేశారు. ఇందులో 541 మంది గర్భిణులకు సాధారణ కాన్పులు కాగా.. మరో 361 మందికి సిజేరియన్లు అయ్యాయి. సీహెచ్‌సీ స్థాయిలోనే ఇంత పెద్ద మొత్తంలో కాన్పులు కావడం విశేషంగా చెప్పవచ్చు.
గత ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు
ఆస్పత్రిలో జరిగిన కాన్పులు ఇలా..
నెల సాధారణ సిజేరియన్
ఆగస్టు 75 52
సెప్టెంబర్ 75 44
అక్టోబర్ 78 61
నవంబర్ 79 56
డిసెంబర్ 75 46
జనవరి 78 49
ఫిబ్రవరి 81 53
Comments
Please login to add a commentAdd a comment