మొక్కజొన్న పంటకు మోతాదులో నీరందించాలి
బిజినేపల్లి: ప్రస్తుతం మొక్కజొన్న పంట కంకి దశలో ఉందని.. ఎక్కువగా నీరు పారించడం వల్ల ఎండుతెగులు వ్యాపించే అవకాశం ఉంటుందని పాలెం కేవీకే శాస్త్రవేత్త డా.శైలజ అన్నారు. బుధవారం మండలంలోని ఖానాపూర్‌లో సాగుచేసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కజొన్నలో ఎక్కువగా ఎండు తెగులును గమనించామని తెలిపారు. ఈ తెగులు వచ్చిన మొక్కలను వేర్లతో సహా తొలగించి, కాల్చివేయాలని రైతులకు సూచించారు. మొక్కజొన్న పంటలో ఎండు తెగులును నివారించాలంటే మోతాదులో నీటిని పారించాలని రైతులకు సూచించారు. సాళ్లలో ఎక్కువ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సేద్య విభాగం శాస్త్రవేత్త డా.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకోండి
కందనూలు: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడల్ స్పోర్ట్స్ పాఠశాల, వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశానికి 9 – 11 ఏళ్లలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి ఫిరంగి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 – 26 సంవత్సరానికి గాను బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 4, 5, 6, 7 తరగతులు చదువుతున్న గిరిజన బాలబాలికలు అర్హులన్నారు. జిల్లాస్థాయి ఎంపికలను ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
న్యాక్ డైరెక్టర్‌గా
జగదీశ్వర్‌రెడ్డి
వనపర్తి: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) రాష్ట్ర డైరెక్టర్‌గా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని అమ్మపల్లికి చెందిన రిటైర్డ్ సీఈ బి.జగదీశ్వర్‌రెడ్డిని నియమిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాక్‌లో చేరే ప్రతి ఒక్కరిలో నైపుణ్యాలు, జీవన ప్రమాణాల పెరుగుదల కోసం కృషిచేస్తానని చెప్పారు. నిర్మాణాత్మక కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చి.. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
కొల్లాపూర్: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ మహాసభల్లో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. హాస్టళ్ల విద్యార్థులకు మెస్‌చార్జీలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. గురుకులాల్లో మెనూ ప్రకారం భోజనం అందడం లేదన్నారు. విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం డివిజన్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.కార్తీక్, నాయకులు శివకుమార్, గణేశ్, భాస్కర్, అంజి, మనోజ్, శివప్రసాద్, ఆకాశ్, భరత్, ప్రదీప్ పాల్గొన్నారు.
మొక్కజొన్న పంటకు మోతాదులో నీరందించాలి
Comments
Please login to add a commentAdd a comment