‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్‌కర్నూల్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.అమరేందర్ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌లో డీఈఓ రమేష్ కుమార్‌తో కలిసి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయని.. మాస్ కాపీయింగ్‌కు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పరీక్ష ప్రశ్న పత్రాలను పోలీస్‌స్టేషన్ నుంచి సరఫరా చేస్తారని.. కేంద్రాల సూపరింటెండెంట్ గదిలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరా నిఘాలో ప్రశ్న పత్రాలను నిర్ణీత సమయంలోనే ఓపెన్ చేయాలన్నారు. పరీక్షల నిర్వహణ అనంతరం ఏ రోజుకా రోజు జవాబు పత్రాలను పోస్టాఫీస్‌కు పంపించాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు గాలి, వెలుతురు పుష్కలంగా ఉండాలన్నారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 21వ ఉత్తీర్ణత స్థానంలో జిల్లా ఉందని.. ఈసారి రాష్ట్ర స్థాయి ఉత్తీర్ణతలో 10వ స్థానంలోపే రావాలని కాంక్షించారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖరరావు, నోడల్ అధికారి కుర్మయ్య, సెక్టోరియల్ అధికారులు షర్ఫు ద్దీన్, వెంకటయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment