ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలను సాధ్యమైనంత మేర వేగవంతం చేయాలని విపత్తుల నిర్వాహణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ రెస్క్యూ బృందాల ప్రతినిధులకు సూచించారు. టన్నెల్ వద్ద సహాయక చర్యలపై ఆయా విభాగాల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ నమూనాతో టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలను బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కల్నల్ పరిక్షిత్ మెహ్ర అధికారులకు వివరించారు. టీబీఎం చివరి భాగంలోని శిథిలాలను తొలగించినట్లు తెలిపారు. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో మట్టితీత పనులు వేగంగా చేపడుతున్నట్లు వివరించారు. టీబీఎం ఎడమవైపు నుంచి వాటర్ జెట్‌ల ద్వారా బురదను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం, హైదరాబాద్‌కు చెందిన ఎన్‌వీ రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్‌లోకి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. టన్నెల్‌లో లైటింట్ సదుపాయాన్ని ముందుకు పొడిగించినట్లు వివరించారు. సమావేశంలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ నాగిరెడ్డి, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి ప్రసన్న, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లక్నో డైరెక్టర్ అయోధ్య ప్రసాద్ తప్లియాల్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment