మోక్షమెప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

మోక్షమెప్పుడో..?

Published Fri, Mar 7 2025 12:37 AM | Last Updated on Fri, Mar 7 2025 12:37 AM

మోక్ష

మోక్షమెప్పుడో..?

అంతర్రాష్ట్ర రహదారిపై హైలెవల్‌ బ్రిడ్జి లేక ఇబ్బందులు

ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులను కలిపేలా పెద్దవాగుపై కాజ్‌వే నిర్మాణం

భారీ వాహనాల రాకపోకలతో

శిథిలావస్థకు చేరిన వైనం

ఇటీవల వాహనాలను

అనుమతించకుండా పోలీసులు పహారా

కలెక్టర్‌ పరిశీలన.. అయినా సమస్య

పరిష్కారం కాక ఇబ్బందులు

బ్రిడ్జితోనే శాశ్వత పరిష్కారం

పెద్దవాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారికి అత్యవసర సేవలందించేందుకు కర్నూలుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. గతంలో నిర్మించిన కాజ్‌వేపై తరుచూ గుంతలు ఏర్పడడంతో రోడ్డు దాటలేని పరిస్థితి నెలకొంది. దానివలన 108 సేవలకు ఆటంకం కలుగుతుంది. హై లెవల్‌ బ్రిడ్జి నిర్మిస్తే వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగకుండా ఉంటుంది.

– శ్రీధర్‌, 108 సిబ్బంది, అయిజ మండలం

పహారా కాస్తున్నాం

పట్టణ సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారిపై గతంలో నిర్మించిన కాజ్‌వే పూర్తిగా శిథిలమైంది. ఇటీవల కాజ్‌వేపై భారీ గుంత పడింది. అధిక లోడుతో ఉన్న వాహనాలు వెళ్లకుండా పోలీసులు కాపలా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఇలా జరిగితే మరమ్మతు చేసేంత వరకు ఎలాంటి ప్రమాదం జరగకుండా రాత్రింబవళ్లు కాపలా కాశం. – శ్రీనిసాసరావు, ఎస్‌ఐ, అయిజ

నివేదికలు పంపించాం..

అయిజ–రాయచూర్‌ రోడ్డుపై అయిజ పట్టణ సమీపంలో పెద్దవాగుపై నిర్మించిన కాజ్‌వే పూర్తిగా శిథిలమైంది. భారీ వాహనాలు వెళ్లేందుకు వీలులేకుండా పోయింది. కాజ్‌వేను తొలగించి హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. – దేశ్యానాయక్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ

అయిజ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలను కలిపే కర్నూలు–రాయచూరు అంతరాష్ట్ర రహదారిపై అయిజ సమీపంలోని పెద్దవాగు వద్ద కొన్నేళ్ల క్రితం నిర్మించిన కాజ్‌వే పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో మూడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే భారీ వాహనాలను కాజ్‌వే గుండా వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కాజ్‌వే రక్షణ గోడలు శిథిలమై.. రంద్రాలు పడగా తూతూ మంత్రంగా మరమ్మతులు చేశారు. ఇటీవల మరోసారి గోతులు పడగా మంగళవారం నుంచి భారీ వాహనాలను కాజ్‌వే గుండా అనుమతించడంలేదు. పోలీసులు ఆర్‌అండ్‌బీ వారికి సమాచారమిచ్చినా.. అటు అధికారులు, ఇటు పాలకులు స్పందించడం లేదు.

మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలు

ఈ కాజ్‌వేపై మూడు రాష్ట్రాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తుంటారు. ప్రతి రోజు వేల సంఖ్యలో వాహనాలు ఈరోడ్డుపై వెళ్తుంటాయి. అలాంటి రోడ్డుకు అడ్డుగా అయిజ పట్టణ సమీపంలో పెద్దవాగు ఉంది. వాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించకపోవడంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన కాజ్‌వేపై వరదనీరు ఉధ్రుతంగా ప్రవహించినప్పుడు ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతుంది. ఎక్కడికి వాహనాలు అక్కడే నిలిచిపోవాల్సి ఉంటుంది. ఇటీవల కాజ్‌వేపై పెద్ద గొయ్యి ఏర్పడగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాజ్‌వే రక్షణ గోడలు బీటలు వారాయి. గోడకు నిర్మించిన రాళ్లు ఊడిపోతున్నాయి. విధిలేక వాహనదారులు వేరే మార్గంపై వెళ్లాలంటే 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు వెళ్లాలంటే రాయచూరు నుంచి గద్వాల మీదుగా.. అలాగే ఏపీ ప్రజలు కర్ణాటకలోని రాయచూరుకు వెళ్లాలనుకుంటే గద్వాల మీదుగా రావాల్సిందే. ఇక రాష్ట్ర ప్రజలు రాయచూరుకు వెళ్లాలన్నా చుట్టూ తిరిగి గద్వాల మీదుగా వెళ్లాల్సిందే. దీంతో ప్రయాసాలతోపాటు వెలకట్టలేని సమయం వృథా చేసుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.

హైలెవల్‌ బ్రిడ్జిపైనే ఆశలు..

గతంలో కాజ్‌వే శిథిలావస్థకు చేరుకొని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం కలెక్టర్‌ బీఎం సంతోష్‌ దృష్టికి వెళ్లగా.. ఆయన నేరుగా కాజ్‌వేను సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. కాజ్‌వే పూర్తిగా శిథిలమైందని, వాహనాలు వెళ్తే ప్రమాదమని పేర్కొంటూ.. తాత్కాలికంగా కాజ్‌వేకు మరమత్తులు చేసి వేసవి కాలంలో కాజ్‌వేను కూల్చివేసి దాని స్థానంలో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. అయినా సరే ఇప్పటి వరకు హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి ముందడుగు పడడంలేదు. ఇదిలాఉండగా, అత్యవసర వైద్య సేవలైన కాన్పులు, రోడ్డు ప్రమాద బాధితులను నిత్యం అయిజ నుంచి ఏపీ రాష్ట్రంలోని కర్నూలుకు అంబులెన్స్‌లలో తరలిస్తుంటారు. కాజ్‌వే పూర్తిగా శిథిలం కావడంతో అంబులెన్స్‌ వాహనాలు గద్వాలకు చేరుకొని అక్కడ నుంచి జాతీయ రహదారిపై కర్నూలుకు వెళ్తుండడంతో అత్యవసర సేవలు ఆలస్యం కావడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
మోక్షమెప్పుడో..? 1
1/1

మోక్షమెప్పుడో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement