అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీ
అచ్చంపేట: అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీ విద్యను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే అంగన్‌వాడీల్లో ఖాళీలుంటే నిర్దేశించిన లక్ష్యాలను అమలు చేయడం కష్టసాధ్యమవుతుందన్న ఉద్దేశంతో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖకు సూచించింది. దీంతో పదవీ విరమణకు అర్హత సాధించినవారు, పదోన్నతికి అర్హత ఉన్నవారితోపాటు కేటగిరిల వారీగా ఖాళీలను లెక్కించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా 14,236 ఖాళీలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఈ మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లోని అన్ని ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి గత నెల 22న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఫైల్‌పై సంతకం చేసిన వెంటనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ పోస్టులను భర్తీ చేసినప్పటికీ వందల సంఖ్యలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పోస్టుల భర్తీ చేయడం ఇదే తొలిసారి.
ఆటపాటలతో..
ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు రోజు మధ్యాహ్న భోజనం, పాలు, ఉడకబెట్టిన కోడి గుడ్డు ఇస్తున్నారు. రెండున్నర సంవతర్సాల వయస్సు కలిగిన చిన్నారుల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఆటపాటల ద్వారా ప్రీ ప్రైమరీ విద్యను బోధిస్తున్నారు.
ఒక్కొక్కరికి రెండు కేంద్రాలు
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,131 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 46,229 మంది చిన్నారులు, 5,745 మంది గర్భిణులు, 3,772 బాలింతలు ఉన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల విభాగంలో మొత్తం 601 పోస్టులు ఖాళీగా ఉండగా.. వాటిలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులు 167 టీచర్లు, హెల్పర్లు 434 ఖాళీగా ఉన్నట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ వెల్లడించింది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడతాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక్కొక్కరికి రెండు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కేంద్రాల్లో హైల్పర్లు లేకపోవడం వల్ల పనిభారం మొత్తం టీచర్లపై పడుతోంది. వారే కేంద్రాలను శుభ్రం చేసుకోవడంతోపాటు గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి చిన్నారులను కేంద్రాలకు తీసుకొస్తున్నారు. కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో లబ్ధిదారులకు మెరుగైన సేవలందడం లేదు.
ఇప్పటికే అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున నోటిఫికేషన్
జిల్లాలో 167 టీచర్లు, 434 ఆయాల పోస్టులు ఖాళీ
Comments
Please login to add a commentAdd a comment