విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
ఉప్పునుంతల: ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యాన్ని ఎంచుకొని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో శ్రద్ధగా చదువుకుంటూ ముందుకెళ్లాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. గురువారం స్థానిక జెడ్పీహెచ్‌ఎస్, కేజీబీవీ, బాలికల ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో డీఈఓ విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రగతిని పరిశీలించారు. విద్యార్థులు ప్రతిరోజు పుస్తక పఠనం చేయడం ద్వారా విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. దీంతోపాటు కీలకమైన ఆలోచన సామర్థ్యాలు, జ్ఞాపకశక్తి పెంపొందడం జరుగుతుందన్నారు. మంచి పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థుల భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పదో తరగతి విద్యార్థులు పట్టుదల, ఏకాగ్రతతో చదువుకొని పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి చదువుకున్న పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కేజీబీవీలో బాలికలు నిర్వహిస్తున్న కరాటే శిక్షణను డీఈఓ పరిశీలించారు. అలాగే బాలికల ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థి స్థాయి నుంచే వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో హెచ్‌ఎంలు బిచ్చానాయక్, కేజీబీవీ స్పెషలాఫీసర్ సైదా, జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment