‘ప్రజావాణి’కి 30 అర్జీలు
నాగర్‌కర్నూల్: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 30 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 6..
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఏఎస్పీ రామేశ్వర్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 6 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 3 తగు న్యాయం చేయాలని, 2 భూమి పంచాయతీ, 1 భార్యాభర్తల గొడవకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఎస్సీ బాలికల
గురుకులం తనిఖీ
కొల్లాపూర్: పట్టణంలోని ఎస్సీ బాలికల గురుకులాన్ని జోనల్ అధికారి ఫ్లారెన్స్‌రాణి సోమవారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి, సౌకర్యాల గురించి ఆరాతీశారు. విర్థినులకు వడ్డించే భోజనాలను రుచి చూశారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలోని టాయిలెట్లను పరిశీలించి.. పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. పదో తరగతి పరీక్షలు బాగా రాసి.. మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఆమె వెంట పాఠశాల ఉపాధ్యాయురాళ్లు తదితరులున్నారు.
‘108’ సేవలను
వినియోగించుకోండి
కల్వకుర్తి రూరల్: ప్రతిఒక్కరు అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలని 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జీవీకే ఈఎంఆర్‌ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న 108 అంబులెన్స్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో వివిధ రకాల పరికరాలు, వాటి పనితీరు, మందులు, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ కాల్ సెంటర్ నుంచి ఎమర్జెన్సీ కేస్ వచ్చిన వెంటనే బయలుదేరి బాధితులను ప్రమాద స్థలం నుంచి ఆస్పత్రికి తరలించాలని సూచించారు. తాము అందిస్తున్న అంబులెన్స్ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటీవ్ శ్రీనివాస్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వరప్రసాద్, మహేష్, గణేష్, మారుతి, పైలట్ అశోక్, భీమయ్య, సాయిబాబు పాల్గొన్నారు.
నేటినుంచి కాచిగూడ
డెమో రైలు పునరుద్ధరణ
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్–కాచిగూడ డెమో రైలును మంగళశారం నుంచి పునరుద్ధరించనున్నారు. కుంభమేళా నేపథ్యంలో దాదాపు 45 రోజుల పాటు ఈ రైలును భక్తుల సౌకర్యార్థం అక్కడికి నడిపారు. తిరిగి నేటి నుంచి ప్రతి రోజు ఉదయం 6.45 గంటలకు మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ వరకు నడవనుంది. డెమో రైలు తిరిగి పున:ప్రారంభం కానుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.7,061
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,061, కనిష్టంగా రూ.4,691 ధరలు లబించాయి. అదేవిదంగా కందులు గరిష్టంగా రూ.6,851, కనిష్టంగా రూ.5,400, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,361, కనిష్టంగా రూ.2,001, పెబ్బర్లు రూ.6,500, జొన్నలు రూ.3,601, మినుములు రూ.7.417 ధరలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment