పాల బిల్లులు చెల్లించాలని రాస్తారోకో
వెల్దండ: తమకు రావాల్సిన పెండింగ్ పాల బిల్లులు వెంటనే చెల్లించాలని పాడి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని పెద్దాపూర్‌లో హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై పాల బిల్లులు చెల్లించాలని పాడి రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ గతంలో పాల బిల్లులు 15 రోజులకు ఒకసారి చెల్లించేవారని, ప్రస్తుతం నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపించారు. పెద్దాపూర్ విజయ డెయిరీ వారికి దాదాపుగా 5 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గ్రామంలోని రెండు పాల కేంద్రాలకు దాదాపు రూ.45 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. ఎప్పుడూ లేని విధంగా పాల బిల్లుల కోసం పాడిరైతులు రోడ్డు ఎక్కుతున్నారని వాపోయారు. పాల బిల్లులు చెల్లించాలని వెల్దండ బీఎంసీయూ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దాదాపు గంటపాటు రైతులు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న వెల్దండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాడిరైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో పాడి రైతులు వెంకట్‌రెడ్డి, శంకర్‌నాయక్, వీరారెడ్డి, శేఖర్, ఆంజనేయులు, పర్వతాలు, అయ్యన్న, అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment