వడదెబ్బ నివారణకు ముందస్తు జాగ్రత్తలు
నాగర్‌కర్నూల్: ఎండాకాలంలో వడదెబ్బ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలతో కలిగే అనారోగ్యాల నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎండలతో శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వయోవృద్ధులు అనారోగ్యానికి గురవుతారని, వీరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఎండాకాలంలో దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని, దీంతో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటామన్నారు. బయటికి వెళ్లేటప్పుడు తమ వెంట తప్పకుండా తాగునీరు తీసుకెళ్లాలని, ఇంట్లో ఉండే మజ్జిగ, నిమ్మరసం, అంబలి వంటివి తరుచుగా తీసుకోవాలన్నారు. వీలైతే సీజనల్ ఫ్రూట్స్ పుచ్చకాయ, కర్భూజ, ఆరేంజ్, దోసకాయ లాంటి పండ్లు, కాయగూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో బయటికి వెళ్లకూడదన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనికి వెళ్లేవారు ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ అన్ని ఆరోగ్య, పీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది, ఆశాల దగ్గర ఓఆర్‌ఎస్ పాకెట్లు సిద్ధంగా ఉంచామన్నారు. ఆల్కహాల్, టీ, కాఫీ, శీతలపానియాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానియాలు తీసుకోరాదని, చెప్పులు లేకుండా బయటకు వెళ్లవద్దన్నారు. ఎవరికై నా ఎండవలన తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. సమావేశంలో డీపీఓ రేనయ్య, ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్, వైద్యులు రాజశేఖర్, ప్రదీప్, శివ, ఎపిడమాలజిస్టు ప్రవలిక, పర్యవేక్షణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment