
నీటి సరఫరాలో ఇబ్బందులు కలగొద్దు
నాగర్‌కర్నూల్: తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని మిషన్ కాంపౌండ్, బీసీకాలనీలో తాగునీటి సరఫరాను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవసహాయం, కాలనీవాసులతో కలిసి అందుబాటులో ఉన్న నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. నీటి ట్యాంకులు, పైపులైన్లు, నీటి సరఫరా సంబంధిత మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నీటి సరఫరాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా మెరుగు, నిరంతరాయంగా నీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు సూచనలు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పైప్‌లైన్ లీకేజీలు లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నాగర్‌కర్నూల్ పుర కమిషనర్ నరేష్‌బాబు, మిషన్ భగీరథ అధికారులు, పుర సిబ్బంది తదితరులు ఉన్నారు.
రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పేదలకు సన్న బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం పుర పరిధిలోని ఎండబెట్ల రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం, తహసీల్దార్ తబితారాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 558 రేషన్ దుకాణాల ద్వారా 2,43,107 రేషన్ కార్డుదారులకు 4,946.455 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్నామని వివరించారు. ఈ పథకంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని.. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వివరించారు.