
ఉద్యమాల ద్వారానే ఉద్యోగ భద్రత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అధ్యాపకులు ఉద్యమించడం ద్వారా ఉద్యోగ భద్రత సాధ్యపడుతుందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి పేర్కొన్నారు. పీయూలో కొన్ని రోజులుగా కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న సమ్మెకు ఆయన శుక్రవారం మద్దతు తెలిపి, మాట్లాడారు. అధ్యాపకులు మరింత ఉత్సాహంగా ఉద్యమం చేయాలని, వారికి పౌర సమాజం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఉన్నతవిద్యలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు సమాజానికి మార్గదర్శకులుగా పనిచేస్తున్నారని, అలాంటి వారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని టెంట్ కింద కూర్చోవడం సభ్య సమాజానికి తలవంపులు తెస్తుందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పీయూ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులుకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని, న్యాయమైన డిమాండ్‌లను నెరవేర్చేందుకు తమవంతు సహకారం ఉంటుందన్నారు.