
మలేరియాను పూర్తిగా నిర్మూలించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: దేశంలో 2030 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించడానికి వైద్య సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటదాస్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీని జెడ్పీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు 2008 నుంచి ప్రతి సంవత్సరం అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. మలేరియా ప్లాస్మోడియం పరాన్న జీవులు గల ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్నారు. దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు అని, దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికెన్ గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. ఇల్లు, పరిసరాల్లో వ్యాధికారగా దోమలు పెరుగుతాయని, ఈ క్రమంలోనే గతేడాది జిల్లాలో 4 మలేరియా కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీరికి చికిత్స అందించి ఇంటి పరిసరాల్లో యాంటీలార్వా మందులు పిచికారీ చేశామన్నారు. ప్రతిఒక్కరూ దోమలు నివారణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీకాకరణ అధికారి రవికుమార్, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసులు, వైద్యులు వాణి, సంతోష్, అభిరాం పాల్గొన్నారు.