సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు అవసరమైన ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈవీఎంల పరిశీలన ఈనెల 19వ తేదీన నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఓటరు జాబితా ముసాయిదా సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే ఎన్నికల నియమావళి మేరకు అధికారులను కూడా బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. జూలై 31వ తేదీలోగా బదిలీలు చేయాల్సి ఉంది. దీంతో యంత్రాంగం బదిలీల కార్యాచరణపై కూడా కసరత్తు మొదలుపెట్టింది.
వేగంగా ఓటరు జాబితా రివిజన్
ఓటరు జాబితా స్పెషల్ సమ్మర్ రివిజన్ కార్యక్రమం జిల్లాలో వేగంగా సాగుతోంది. 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించనుంది. మరోవైపు ఓటును ఒకచోటనుంచి మరో చోటికి బదిలీ చేసుకోవడంతోపాటు రెండు ఓట్లు ఉన్నవాటిని తొలగించడం, చనిపోయిన వారి ఓట్లు కూడా తొలగించే కార్యక్రమం నిర్వహిస్తోంది. వాటిపై వచ్చిన ఫిర్యాదులను కూడా పరిష్కరించి అక్టోబర్ నాలుగో తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాబితా ఆధారంగానే ఎన్నికలు జరగనున్నాయి.
19 నుంచి పరిశీలన
ఈనెల 19వ తేదీ నుంచి ఈవీఎంల పరిశీలన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈసీఐఎల్ కంపెనీ నుంచి ఈవీఎంలు జిల్లాకు వచ్చాయి. అందులో 3,158 బ్యాలెట్ యూనిట్లు, 2,466 కంట్రోల్ యూనిట్లు 2,667 వీవీ ప్యాట్‌లు ఉన్నాయి. వాటన్నింటికి ఈనెల 19 నుంచి జూన్ 7వ తేదీ వరకు మొదటి లెవల్ చెకింగ్ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఈసీఐఎల్ కంపెనీకి చెందిన 15 మంది ఇంజనీర్లు రానున్నారు.
గతంలో వాడిన యంత్రాలు మహారాష్ట్రకు..
జిల్లాలో గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో వాడిన బీహెచ్‌ఈఎల్ కంపెనీకి చెందిన ఓటింగ్ యంత్రాలను మహారాష్ట్రలోని చంద్రపురి జిల్లాకు పంపుతున్నారు. ఇందులో 1,940 బ్యాలెట్ యూనిట్లు, 644 కంట్రోల్ యూనిట్లు, 677 వీవీ ప్యాట్‌లు ఉన్నాయి. వాటన్నింటిని కొన్ని బీహెచ్‌ఈఎల్ కంపెనీకి పంపగా మిగిలిన వాటిని మహారాష్ట్రకు పంపుతున్నారు.
జూలై 31లోగా బదిలీలు పూర్తి చేసేలా..
ఎన్నికల సంఘం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మూడేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని ఆదేశించింది. అదేవిధంగా సొంత జిల్లాలో పనిచేసే అధికారులను బదిలీ చేయనున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పనిచేసి సస్పెండ్‌కు గురైన వారికి వచ్చే ఎన్నికల్లో విధులను అప్పగించరాదని ఆదేశించింది. వాటన్నింటిని దృష్టిలో ఉంచుకొని జూలై 31లోగా బదిలీ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment