విలేకరులకు వివరాలు వెల్లడిస్తున్న మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణ
మిర్యాలగూడ టౌన్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిర్యాలగూడ రూరల్ సీఐ ముత్తినేని సత్యనారాయణ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బాలిక ఈ నెల 22వ తేదీన ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన చరణ్‌దీప్ తన తమ్ముడు శరత్‌తో పాటు అతడి మిత్రులు అంజి, మహేష్ కలిసి బాలికను బైక్‌పై ఎక్కించుకొని అడవిదేవులపల్లి మండల సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లోని సత్రశాలకు తీసుకెళ్లారు. అక్కడ బాలికను చరణ్‌దీప్ వివాహం చేసుకున్నాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. దీంతో భయపడిన బాలిక నాన్న దగ్గరికి వెళ్తానని అనడంతో రంగారెడ్డి జిల్లా పరిధిలోని హయత్‌నగర్‌లో వదిలివేశారు. హయత్‌నగర్ బస్టాండ్ వద్ద బాలికను తల్లిదండ్రులు, పోలీసులు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు.
బాలికను తీసుకెళ్లిన నలుగురు యువకులపై పోక్సో, నిర్భయ, అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమెదు చేశారు. పరారీలో ఉన్న నలుగురు యువకులు మిర్యాలగూడ పట్టణ సమీపంలోని అవంతీపురంలో ఉన్నట్లు తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు మంగళవారం వారిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేశారు. నిందితులను పట్టుకున్న కానిస్టేబుల్ నాగయ్య, హోంగార్డు గోపిని సీఐ అభినందించారు. విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ దోరేపల్లి నర్సింహులు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment