సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాల్లోనే అభ్యర్థులను ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలకు గాను ఆదివారం నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని రో జులుగా జాబితా ఇదిగో.. అదిగో.. అంటూ ఉత్కంఠ రేపుతూ వచ్చిన అధిష్టానం ఆలస్యంగానైనా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుందని ఆశావహులు భావించారు. అందుకు భిన్నంగా నాలుగు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించడంతో మిగతా చోట్ల ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ ఆదివారం ప్రకటించింది. అందులో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలకుగాను నాగార్జునసాగర్ నుంచి కంకణాల నివేదిత రెడ్డి, సూర్యాపే ట నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరి నుంచి గూడూరు నారాయణరెడ్డి, తుంగతుర్తి నుంచి కడియం రామచంద్రయ్య పేర్లను ఖరారు చేసింది.
ఆయనే పోటీచేస్తారా.. ?
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతేడాది ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో గతేడాది ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో హోరాహోరిగా పోటీ జరిగింది. రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు సాధారణ ఎన్నికల్లో పోటీలో ఉండేందుకు రాజగోపాల్‌రెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయినా, బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చోటు కల్పించలేదు. దీంతో ఆయనే అక్కడి నుంచి పోటీచేస్తారా? ఆయన సతీమణిని పోటీలో దింపుతారా? అన్న చర్చ మొదలైంది. ఇదివరకు ఈ చర్చ ఉన్నప్పటికీ రాజగోపాల్‌రెడ్డినే పోటీలో ఉంటారని పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఇప్పుడు ఆయన పేరును మొదటి జాబితాలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, బీజేపీ రెండో జాబితాను ఎప్పుడు ప్రకటిస్తుందనే చర్చ జరుగుతోంది. ఆ జాబితా ఎప్పుడు వస్తుంది.. ఆ అభ్యర్థుల ప్రచారానికి ఎంత సమయం ఉంటుందనే విషయాలను అధిష్టానం ఆలోచించడం లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానించాయి.
నివేదితకు మరోసారి అవకాశం
సాగర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి కంకణాల నివేదితరెడ్డి 2018 ఎన్నికల్లో పోటీచేశారు. ఇప్పుడు మరోసారి పోటీలో ఉండబోతున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి సతీమణి కావడంతో ఆమెకు రెండోసారి టికెట్ దక్కింది.
తొలిసారి పోటీలో..
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గూడురు నారాయణరెడ్డి మొదటిసారి పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి, యువజన సంఘాల నాయకునిగా కొనసాగుతూ 2005 నుంచి 2020 వరకు ఏఐసీసీ సభ్యుని ఉన్నారు. పీసీపీ కోశాధికారిగా పని చేశారు. 2020లో బీజేపీలో చేరిన ఆయన ఇప్పుడు మొదటిసారిగా బీజేపీ నుంచి పోటీచేస్తున్నారు.
మళ్లీ తుంగతుర్తి నుంచే..
తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కడియం రామచంద్రయ్య బీజేపీ అభ్యర్థిగా రెండోసారి పోటీలో ఉంటున్నారు. 2018లో బీజేపీలో చేరిన ఆయన ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఇప్పుడు కూడా అక్కడి నుంచే రెండోసారి పోటీ చేస్తున్నారు.
ఇంకా ఉత్కంఠ..
బీఆర్‌ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ఆగస్టు 21వ తేదీనాడే ప్రకటించి ప్రచారంలో దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుకు సాగుతోంది. బీజేపీ మాత్రం మొదటి జాబితాను ప్రకటించడంలో ఆలస్యం కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. జాబితాను ఎప్పుడు ప్రకటిస్తుందోనని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు ఆదివారం ప్రకటించినా ఉమ్మడి జిల్లాలో నాలుగు పేర్లనే ప్రకటించడంతో మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
ఐదోసారి పోటీలో సంకినేని
అసెంబ్లీ ఎన్నికల్లో సంకినేని వెంకటేశ్వర్‌రావు ఇప్పుడు ఐదోసారి పోటీ చేయబోతున్నారు. ఒకసారి తుంగతుర్తి నుంచి గెలుపొందిన ఆయన ఒకసారి ఆ నియోజవర్గం నుంచి ఓడిపోయారు. ఆ తరువాత సూర్యాపేటలో రెండుసార్లు ఓడిపోయారు. 1999లో ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి టీడీపీ తరపున పోటీచేసి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్‌గా మారడంతో సూర్యాపేటకు వచ్చారు. అప్పుడు పోటీచేయాలని భావించినా మహాకూటమి పొత్తులో ఆ స్థానాన్ని టీఆర్‌ఎస్‌కు కేటాయించారు. ఇక 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నుంచి మళ్లీ పోటీలో ఉండబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment