సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పుపై ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని రెండు రోజులుగా ప్రచారం జోరందుకోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా, బీజేపీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాజగోపాల్‌రెడ్డి పేరు.. ఇటీవల బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాలో లేకపోవడం హాట్ టాపిక్ అయింది.
తాను మునుగోడు నుంచే పోటీ చేస్తానని గతంలో ఆయన స్వయంగా ప్రకటించినా, ఆ తరువాత ఎల్‌బీనగర్ నుంచి పోటీచేయబోతున్నారని చర్చసాగడం, చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న వాదన జోరందుకుంది. ఒకటీ రెండు రోజుల్లో రాజగోపాల్‌రెడ్డి సొంతగూటికి చేరుబోతున్నారని, దీనికి సంబంధించిన సంప్రదింపులు జరిగాయన్న చర్చ కాంగ్రెస్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ నుంచే రాజకీయ అరంగేట్రం
2009 సాధారణ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. అదే సంవత్సరం భువనగిరి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్థానక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన 2018లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ పదవీకాలం ముగియకుండానే 2022లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
దీంతో మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చాయి. హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. బీజేపీలో చేరినా తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న భావన ఆయన అనుచరుల నుంచే వ్యక్తమవుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే పరిస్థితిలో బీజేపీలో లేదని రాజగోపాల్‌రెడ్డి పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు సన్నిహితులు పేర్కొంటున్నారు.
అందుకే ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చెప్పకుండా బీజేపీ మొదటి జాబితాలో రాజగోపాల్‌రెడ్డి పేరు చేర్చకుండా చూసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి పార్టీ మార్పు విషయంలో ఆయన ఓ నిర్ణయానికి వచ్చారని, ఒకటీ రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు పేరొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment