
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు. ప్రశాంత్ (ఫైల్)
భూదాన్‌పోచంపల్లి: కారు అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం అర్థరాత్రి భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం శివారులో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జలాల్‌పురం గ్రామానికి చెందిన కేసారం ప్రశాంత్ (19) చిన్నతనంలోనే అతడి తండ్రి కేసారం పాపయ్య మృతిచెందగా.. తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోయింది.
దీంతో ప్రశాంత్‌ను అతడి తాత, నాయనమ్మ పెంచి పెద్ద చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ హైదర్‌పూర్‌లోని ఓ ఫాంహౌజ్‌లో పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తెచ్చుకొన్న ప్రశాంత్ బుధవారం సాయంత్రం జలాల్‌పురం గ్రామానికే చెందిన తన స్నేహితులు నర్ర విజయ్, నర్ర శివ, శాపాక నవదీప్, నర్ర శ్రీరాములుతో కలిసి పోచంపల్లికి వచ్చాడు.
అనంతరం అర్థరాత్రి 11.50 గంటల సమయంలో పోచంపల్లి నుంచి జలాల్‌పురం వెళ్తుండగా.. గ్రామ శివారులోని సబ్ స్టేషన్ సమీపంలోకి రాగానే మూలమలుపు వద్ద అతివేగంగా ఉన్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కరెంట్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ అక్కడక్కడే మృతిచెందగా, నర్ర విజయ్, నర్ర శివకు తీవ్ర గాయాలయ్యాయి.
మరో ఇద్దరు శాపాక నవదీప్, శ్రీరాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డు వెంట వెళ్తున్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
తప్పిన పెనుప్రమాదం..
కాగా అతివేగంగా ఉన్న కారు రోడ్డు పక్కనే ఉన్న భారీ కరెంట్ స్తంభాలను బలంగా ఢీకొట్టడంతో కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంట్ తీగలు కారుపై పడ్డాయి. దీంతో కరెంట్ ప్రసరణ ఉండటంతో క్షతగాత్రులను బయటికి తీయడానికి అక్కడున్నవారు కొద్దిసేపు సాహసించలేదు. అయితే కొద్దిసేపటి తర్వాత కరెంట్ వైరు కారు నుంచి పక్కకు జారిపడటంతో అందరూ విద్యుదాఘాతం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
లేదంటే కారులోఉన్న ఐదుగురు విద్యుదాఘాతానికి గురయ్యేవారు. వెంటనే కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment