నిత్య శ్రమజీవి.. నిండుగా దేశభక్తి
తిప్పర్తిలోని కూడలిలో జాతీయగీతం ఆలపిస్తున్న పాపయ్య
తిప్పర్తి: నిత్యం కూరగాయలు, ఆకుకూరలు విక్రయిస్తూ.. జీవితాన్ని గడిపే వృద్ధుడు తనలోని దేశభక్తిని గొప్పగా చాటుతున్నాడు. రోజూ ఉదయం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో 2022 జనవరి 27వ తేదీ నుంచి నిత్య జాతీయ గీతాలాపన నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 8.30 గంటలకు మెయిన్ రోడ్డుపై వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేసి జనగణమన పాడుతున్నారు. ఈ కార్యక్రమానికి తిప్పర్తి గ్రామపంచాయతీ పరిధిలోని నూకలవారిగూడం గ్రామానికి చెందిన నూకల పాపయ్య(72) ప్రతిరోజూ హాజరై జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నాడు. రోజూ ఆ పరిసర ప్రాంతంలో ఆకుకూరలు, కూరగాయలు విక్రయిస్తూ 8.30 గంటలు కాగానే కూరగాయల సంచి పక్కన పెట్టి.. జాతీయ జెండా పట్టుకుని కూడలికి వచ్చి జనగణమన పాడుతున్నాడు. ఆ తర్వాత తన పని చూసుకుంటాడు. మధ్యాహ్నం వేళ గేదెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. పాపయ్య ప్రతిరోజూ జాతీయ గీతం ఆలపించడాన్ని ప్రజలు ఆసక్తిగా చూస్తుంటారు.
జాతీయ గీతం పాడాలని కోరిక
తిప్పర్తి మండల కేంద్రంలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి.. నాకు కూడా జాతీయ గీతం పాడాలని కోరిక కలిగింది. అందుకని ఎంత పని ఉన్నా.. ఆ సమయానికి తిప్పర్తి కూడలిలో ఉంటాను. జెండాను నేనే తెచ్చి జాతీయగీతం పాడినంత సేపు అక్కడే ఉండి ఆ తరువాత నా పని చూసుకుంటాను.
– నూకల పాపయ్య
నిత్య శ్రమజీవి.. నిండుగా దేశభక్తి
Comments
Please login to add a commentAdd a comment