కార్పొరేట్ దోపిడీ!
ధరల పట్టికను తప్పక ప్రదర్శించాలి
తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టు 2011 ప్రకారం ఆస్పత్రుల్లో ధరల పట్టిక విధిగా ప్రదర్శించాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులపై నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆస్పత్రులతో పాటు అవసరం లేని పరీక్షలతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ
నల్లగొండ టౌన్: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల కార్పొరేట్ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 500కు పైగా ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. అందులో చిన్నాచితక, కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులతో పాటు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ప్రతి ఆస్పత్రికి అనుబంధంగా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్న ఆస్పత్రుల నిర్వాహకులు అవసరం లేని పరీక్షలు చేస్తూ ఒక్కొక్కరి నుంచి వేలకు వేలు ఫీజుల రూపంలో దండుకుంటున్నారు. ఆస్పత్రుల నిర్వాహకులు కూడా చిన్న పాటి జబ్బుకు కూడా వివిధ రకాల పరీక్షలకు రిఫర్ చేస్తున్నారు. చిన్న, పెద్ద రోగం అనే తేడా లేకుండా బీపీ, షుగర్, థైరాయిడ్, హిమోగ్లోబిన్, ఎక్స్‌రే, ఈసీజీ, మూత్ర పరీక్షలతో పాటు హెచ్‌ఐవీ పరీక్షలను చేయిస్తూ రోగుల జేబులు ఖాళీ చేస్తున్నారు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు వైద్యులు ఇలాంటి నిర్వాకాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ..
తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టు 2011 నిబంధనల ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో అందిస్తున్న సేవలు, పరీక్షలు, వాటికి తీసుకునే ఫీజుల వివరాలను రోగులకు కనిపించే విధంగా ఫ్లెక్సీలను తెలుగులో ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో సగానికి పైగా ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఎలాంటి ధరల పట్టికలను ప్రదర్శించకపోవడం గమనార్హం. సంబంధిత శాఖ అధికారులు అలాంటి ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ పరీక్షల పేరుతో రూ.వేలల్లో ఫీజులు దండుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు
ఫ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో ప్రదర్శించని ధరల పట్టిక
నల్లగొండ పట్టణంలోని రెహమత్‌నగర్‌కు చెందిన 50 సంవత్సరాల మహబూబ్ అలీ (పేరు మార్చాం) అనే వ్యక్తికి గత నెల రోజుల క్రితం కాలికి గాయమైంది. అతనికి షుగర్ వ్యాధి ఉండటంతో గాయం తగ్గకుండా పుండుగా మారింది. దీంతో ఆయన పట్టణంలోని ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లాడు. అతడిని పరీక్షించిన డాక్టర్ బీపీ, షుగర్, థైరాయిడ్, మూత్ర, హిమోగ్లోబిన్ తదితర పరీక్షలను చేయించాడు. చివరకు కూడా షుగర్ కూడా కంట్రోల్‌లో ఉందని రిపోర్టు ఇచ్చి రూ. 3500 బిల్లు వసూలు చేశారు. ఇవన్ని ఎందుకు చేశారని ల్యాబ్ టెక్నీషియన్‌ను అడగ్గా డాక్టరే రాసినందున పరీక్షలు చేయాల్సి వచ్చిందని తామేమీ చేయలేమని సమాధానం ఇచ్చాడు. బిల్లు చెల్లించి డాక్టర్‌ను సంప్రదిస్తే షుగర్ కంట్రోల్‌లో ఉందని యాంటి బయాటిక్ పారాసిటమిల్ టాబ్లెట్లు రాసి పంపాడు. జిల్లాలోని అనేక ఆస్పత్రుల్లో నిత్యం సాగుతున్న నిర్వాకానికి, రోగుల నిలువు దోపిడీకి ఇదే నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment