ఫలితం తేలేది నేడే..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం
సాక్షి ప్రతినిది, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం సోమవారం తేలనుంది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయింది. రిహార్సల్స్ కూడా నిర్వహించారు. సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. మొత్తం చెల్లిన ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు.
25 టేబుళ్లపై లెక్కింపు..
3వ తేదీ ఉదయం 7 గంటలకు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ హాల్‌కు తీసుకురానున్నారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు.. 25 బ్యాలెట్లను ఒక బండిల్ చొప్పున కట్టలు కట్టి డ్రమ్ములో వేస్తారు. 8 గంటలు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఓట్ల లెక్కింపు కూడా 25 టేబుళ్లపై నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్‌కు వేయి బ్యాలెట్ పేపర్ల చొప్పున లెక్కించనున్నారు. దీంతో మొదటి రౌండ్‌లోనే మొత్తం పోలైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది.
పోలైన ఓట్లు 24,139
నియోజవర్గం పరిధిలో మొత్తం 25,797 ఓట్లు ఉండగా.. అందులో 24,139 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 93.57 శాతం పోలింగ్ నమోదైంది. చెల్లిన ఓట్లలో సగం ఓట్ల కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు.
మొదటి ప్రాధాన్యతలో ఫలితం
తేలకపోతే ఎలిమినేషన్..
అభ్యర్థులు ఎవరూ మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజయం సాధించలేకపోతే.. అప్పుడు ఎన్నికల అధికారులు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటించి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించనున్నారు. పోటీ చేసిన 19 మంది అభ్యర్థుల్లో ఎవరికై తే అతి తక్కువగా ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థిని ఎలిమినేషన్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసారో చూసి ఆ అభ్యర్థులకు కలుపుతారు. అలా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక ఓటును ఎవరు సాధిస్తారో.. అప్పటి వరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే మాత్రం చివరి ఫలితం అర్ధరాత్రి వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఫ చెల్లిన ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా.. వారే విజేత
ఫ మధ్యాహ్నం వరకు పూర్తి కానున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు..
ఫ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ గెలువకపోతే ఎలిమినేషన్..
ఫ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
సిబ్బంది కేటాయింపు..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 25 టేబుళ్లపై నిర్వహిస్తారు. ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం 150 మంది టేబుళ్లపై కౌంటింగ్ కోసం ఉండగా, 20 శాతం రిజర్వు సిబ్బంది ఉంటారు. మరో 200 మంది కౌంటింగ్ సమయంలో సహకరించనున్నారు. 530 మంది పోలీస్ సిబ్బంది కౌంటింగ్ బందోబస్తులో
పాల్గొననున్నారు.
ఫలితం తేలేది నేడే..
Comments
Please login to add a commentAdd a comment