హుజూర్‌నగర్: బంగారం షాపుల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను శనివారం సీఐ చరమంద రాజు వెల్ల డించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన చింతలచెర్వు ప్రశాంత్, చింతలచెర్వు అక్షిత్‌కుమార్, నల ్ల గొండ పట్టణానికి చెందిన షేక్ వాజిద్, షేక్ ఇర్ఫాన్ ముఠాగా ఏర్పడ్డారు. దురలవాట్లకు బానిసై, తేలికగా డబ్బులు సంపాదించాలానే ఉద్దేశంతో గూగుల్‌లో ఎస్‌ఐల ఫొటోలు డౌన్‌లోడ్ చేసుకొని ఆ ఫొటోలను ట్రూకాలర్, వాట్సాప్‌లో డీపీలుగా పెట్టుకొని బంగారం షాపు యాజమానుల వివరాలు సేకరించారు. బంగారం షాపుల యజమానులకు ఫోన్ చేసి తాము పలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి ‘మేము కొంతమంది దొంగలను పట్టుకున్నాం.. వారు దొంగిలించిన బంగారం మీ బంగారం షాపులో అమ్మారు.. ఆ బంగారం మీ నుంచి రికవరీ చేయాలి లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతాం’ అని బెదిరించేవారు. ఈ విధంగా బంగారు షాపుల యజమానుల నుండి డబ్బులు ఫోన్ పే చేయించుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీన చింతలచెర్వు ప్రశాంత్ తిరుమలగిరికి చెందిన శివకుమార్ అనే జ్యువెలరీ షాపు యజమానికి ఫోన్ చేసి ‘నేను రాజాంపేట్ ఎస్‌ఐని మాట్లాడుతున్నా.. నువ్వు దొంగల వద్ద బంగారం కొన్నావు.. నీ పైన కేసు కాకుండా ఉండాలంటే రూ.లక్ష ఫోన్ పే చెయ్యమని చెప్పాడు’. దీంతో శివకుమార్ భయపడి రూ.52 వేలు ఫోన్ పే ద్వారా పంపాడు. అదేవిధంగా ఈ నెల 8న హుజూర్‌నగర్‌లోని శ్రీనిధి జ్యువెలరీ షాపు యజమాని తుడిమల్ల నవీన్‌కుమార్‌కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అతడు భయపడి వారు చెప్పిన ఫోన్ పే నంబర్‌కు రూ.10 వేలు పంపారు. అనంతరం నవీన్‌కుమార్‌కు అనుమానం వచ్చి హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ ముత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం ఎస్‌ఐ ముత్తయ్య తన సిబ్బందితో గోపాలపురం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ప్రశాంత్, అక్షిత్‌కుమార్, వాజిద్, ఇర్ఫాన్ రెండు మోటార్ సైకిళ్లపై కోదాడ వైపు అనుమానాస్పదంగా వెళ్తుండగా.. పట్టుకుని విచారించగా వారు చేసిన నేరాలను అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లు, 4 సెల్‌ఫోన్లు, రూ.24,900 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
2 మోటారు సైకిళ్లు, 4 సెల్‌ఫోన్లు, రూ.24,900 నగదు స్వాధీనం