రామగిరి(నల్లగొండ): ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆర్టీసీ డ్రైవర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆర్టీసీ బస్ భవన్ అధికారులు విచారణకు ఆదేశించారు. వివరాలు.. నల్లగొండలో పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న మాచన రఘునందన్ శనివారం హైదరాబాద్ నుంచి నల్లగొండకు వచ్చేందుకు గాను ఎల్బీనగర్‌లో నాన్‌స్టాప్ బస్సు(టీఎస్ 07 జెడ్ 4038) ఎక్కారు. ఆ బస్సును హయత్‌నగర్‌లో డ్రైవర్ ఆపాడు. అయితే బస్సు హయత్‌నగర్‌లో ఆగదు అని తనకు కంట్రోలర్ చెప్పిన విషయాన్ని బస్సు డ్రైవర్‌కు రఘునందన్ గుర్తుచేశారు. దీంతో డ్రైవర్ తనతో దురుసుగా, అమర్యాదగా మాట్లాడాడని మాచన రఘునందన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన నల్లగొండ ఆర్టీసీ ఆర్‌ఎంకు, డీఎంకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనికి ఆర్టీసీ బస్ భవన్ అధికారులు ఎక్స్(ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నల్లగొండ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. శనివారం వినియోగదారుల హక్కుల దినోత్సవం రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు
విచారణకు ఆదేశం