రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. రహదారులపై ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ శాఖ సూచనల మేరకు ప్రమాదాలు జరగకుండా జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ.. మిషన్ ఆధార్ పేరున రహదారుల దగ్గర్లో ఉన్న గ్రామాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసిన పోలీస్, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల సంస్థ అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు.