నల్లగొండ: ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సివిక్స్ పరీక్షలకు సంబంధించి ఈ నెల 22న జరగాల్సిన మూల్యాంకనం 21వ తేదీ (శుక్రవారం)కి మార్చినట్లు డీఐఈఓ దస్రూ నాయక్ గురువారం తెలిపారు. ఎగ్జామినర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
నల్లగొండ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు ఉపకార వేతనాల మంజూరు కోసం ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు కోటేశ్వర్‌రావు గురువారం తెలిపారు. విద్యార్థులు telanga naepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు వారి బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్‌తో సీడింగ్ చేయించుకోవాలని సూచించారు.
బడ్జెట్‌లో ప్రాధాన్యత రంగాలను విస్మరించారు
నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రాధాన్యత రంగాలను విస్మరించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. గురువారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో అంకెలు కేటాయించారే తప్ప ప్రజల అవసరాలకు అనుగుణంగా అమలు చేయడం లేదన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ, సాగునీటి, గ్రామీణ పట్టణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయన్నారు. జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నాగార్జున అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, మల్లేష్, శ్రీశైలం, ప్రభావతి, లక్ష్మీనారాయణ, హశం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి 25న ఇంటర్వ్యూలు
నల్లగొండ: నల్లగొండ డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఈ నెల 25న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి గురువారం తెలిపారు. అభ్యర్థులకు ఆరోగ్య, వ్యాయామ విద్య బోధించేందుకు ఎంపీఈడీ, దృశ్యకళలు, ప్రదర్శన కళలు బోధించేందుకు ఎంపీఏ/ఎంఎఫ్‌ఎ/బీఎఫ్‌ఎ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, ఫొటోతో నల్లగొండ డైట్ కళాశాలలో ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. వివరాలకు 99499 93723 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ప్రభుత్వ ఆస్పత్రి సందర్శన
మర్రిగూడ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాయకల్ప పీర్ అసెస్‌మెంట్ స్టేట్ టీం సభ్యులు గురువారం మర్రిగూడ సీహెచ్‌సీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. టీం సభ్యురాలు డాక్టర్ స్వప్నరాథోడ్ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సీహెచ్‌సీలో మరికొంత మంది వైద్యులు, సిబ్బంది అవసరం ఉందని వారిని నియమిస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీం సభ్యులు మంజుల, సమీనా, సూపరింటెండెంట్ శంకర్‌నాయక్, గణేష్, పాల్గొన్నారు.
ముగిసిన ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు
నల్లగొండ: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కెమిస్ట్రీ– 2, కామర్స్– 2 పరీక్షకు సంబంధించి జిల్లాలో మొత్తం 12,894 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 12,504 మంది హాజరయ్యారు. 390 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు.
మూల్యాంకనం తేదీలో మార్పు