కందుల కొనుగోలుకు కొర్రీలు | - | Sakshi
Sakshi News home page

కందుల కొనుగోలుకు కొర్రీలు

Published Wed, Apr 2 2025 2:00 AM | Last Updated on Wed, Apr 2 2025 2:00 AM

కందుల

కందుల కొనుగోలుకు కొర్రీలు

కొండమల్లేపల్లి : కందులు సాగు చేసిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు.. పంట విస్తీర్ణం వంటి వివరాలు నమోదు చేసుకున్న రైతుల కందులు మాత్రమే కొనుగోలు కేంద్రంలో కొంటామంటూ కొర్రీలు పెడుతుండడంతో కందిసాగు చేసిన రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. వ్యవసాయ అధికారుల జాబితాలో పేర్లున్న రైతులు.. దళారులకు సహకరిస్తుండడంతో అసలు రైతులు నష్టపోతున్నారు.

మార్చి 7న కేంద్రాలు ప్రారంభం

జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్‌ కేంద్రాలు ఉండగా కొండమల్లేపల్లి, హాలియాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో మార్చి 7వ తేదీన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రాల్లో కొండమల్లేపల్లి, గుర్రంపోడు, పెద్దఅడిశర్లపల్లి, చింతపల్లి, తిరుమలగిరిసాగర్‌, హాలియా, పెద్దవూర తదితర ప్రాంతాల నుంచి రైతులు కందులు విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఈసారి వ్యవసాయ అధికారుల జాబితాలో పేర్లు ఉన్న రైతుల కందులు మాత్రమే కొనుగోలు చేస్తామంటూ కేంద్రం నిర్వాహకులు చెబుతుండడంతో ఆరుగాలం కష్టించి కంది సాగు చేసిన రైతులు తమ కందులు కూడా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

అదనంగా కేజీ తూకం..

సాధారణంగా రైతులు తమ వద్ద ఉన్న కందులను ఎండబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తారు. కానీ కేంద్రం నిర్వాహకులు కందులను నిల్వ చేయాల్సి ఉంటుదని చెప్తూ 50 కేజీలకు బదులు 51 కేజీల తూకం వేస్తున్నారు.

వ్యవసాయ అధికారుల తీరుపై విమర్శలు..

రైతులు వారి భూ విస్తీర్ణంతోపాటు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేశారన్న వివరాలను వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేయించుకోవాలి. ఇందుకు గాను ఏఓ స్థాయి అధికారి లేదా ఏఈఓ క్షేత్రస్థాయిలో పంటలను స్వయంగా పరిశీలించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. కానీ అప్పట్లో రైతులే తమ వద్దకు వచ్చి వివరాలు నమోదు చేయించుకోవాని వ్యవసాయ అధికారులు సూచించారు. చాలా మంది రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై వివరాలను నమోదు చేయించుకోలేదు. ఇప్పుడు జాబితాలో పేరు లేకపోవడంతో ప్రభుత్వ కేంద్రంలో కందులు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.

ఫ రైతులకు శాపంగా వ్యవసాయ అధికారుల నిబంధనలు

ఫ కొత్త దందాకు తెరలేపిన దళారులు

ఫ గతంలో నిల్వ చేసిన కందులు సైతం కేంద్రంలో విక్రయాలు

ఫ నష్టపోతున్న రైతులు

కందులు కొనడం లేదు

నా కున్న ఏడెకరాల్లో కంది సాగు చేశాను. వ్యవసాయ అధికారులు ఆరు ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నట్లు నమోదు చేయడంతో.. ఆ ఆరు ఎకరాల కందులు మాత్రమే కొంటున్నారు. మిగతా ఎకరం భూమిలో పండిన కందులు కొనడం లేదు. దీంతో 8 క్వింటాళ్ల కందులు అమ్ముకోలేని పరిస్థితి ఉంది.

– అంజన్‌రావు, రైతు జిన్నాయిచింత, గుర్రంపోడు మండలం

రైతుల కందులనే కొనుగోలు చేస్తున్నాం

కొండమల్లేపల్లి, హాలియాలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 481 మంది రైతుల నుంచి 11,323 బ్యాగుల్లో 5631.50 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశాం. వ్యవసాయ అధికారులు చేపట్టిన సర్వేకు సంబంధించి లిస్టులో పేరున్న రైతుల నుంచి మాత్రమే కందులను కొనుగోలు చేస్తున్నాం. దళారులకు తావివ్వకుండా రైతులకు మేలు చేసే విధంగా కొనుగోళ్లు చేపడుతున్నాం.

– జ్యోతి, మార్కెట్‌ డీఎం, నల్లగొండ

నిల్వ ఉంచిన కందుల విక్రయం

వ్యవసాయ అధికారుల జాబితాలో పేరు లేని రైతుల వద్ద నుంచి దళారులు కందులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వారు వ్యవసాయ అధికారుల జాబితాలో పేరున్న రైతులతో ఒప్పందం చేసుకొని వారికి కొంత ముట్టజెప్పి వారి ద్వారా ప్రభుత్వ కేంద్రంలో కందులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడ్డ రైతులు నష్టపోతున్నారు. ఇక, గతంలో తమ వద్ద నిల్వ ఉంచిన కందులను సైతం దళారులు ప్రభుత్వ కేంద్రంలో అమ్ముతున్నారు. కానీ వ్యవసాయ అధికారులు మాత్రమ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

కందుల కొనుగోలుకు కొర్రీలు1
1/2

కందుల కొనుగోలుకు కొర్రీలు

కందుల కొనుగోలుకు కొర్రీలు2
2/2

కందుల కొనుగోలుకు కొర్రీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement