నల్లగొండ : స్వయం సహాయక మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. స్వయం సహాయక మహిళా సంఘాలపై గురువారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈఓ దివ్య ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు, పాఠశాల విద్యార్థుల యూనిఫాం, పెట్రోల్ బంకుల నిర్వహణ తదితర కార్యక్రమాల వల్ల స్వయం సహాయక మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐకేపీ ద్వారా యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలన్నారు. కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే కమీషన్ మొత్తంలో 10 శాతం జిల్లా సమాఖ్యలు, 90శాతం గ్రామ సమాఖ్యలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సదరం క్యాంపులు డేటాను ఎప్పటికప్పుడు పూర్తి చేసేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలన్నారు. ఆసరా పింఛన్లకు సంబంధించిన లబ్ధిదారులు చనిపోతే వారి పేర్లను జాబితాలో తొలగించాలని.. భాగస్వామికి అర్హత ఉంటే పింఛన్ మంజూరు చేయాలన్నారు. మండల, నియోజకవర్గాల స్థాయిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు మహిళా సంఘాలు సిద్ధం కావాలన్నారు. ఈ పెట్రోల్ బంకుల వద్ద రెస్టారెంట్, మాల్స్ నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.