ఉరి శిక్ష సరైనదే.. | - | Sakshi
Sakshi News home page

ఉరి శిక్ష సరైనదే..

Published Wed, Apr 9 2025 1:34 AM | Last Updated on Wed, Apr 9 2025 1:36 AM

పన్నెండేళ్లుగా నరకం అనుభవిస్తున్నా

కాలుకు మేకులు గుచ్చుకున్నా పరిగెత్తా..

చిలుకూరు: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటనలో తన కాలుకు మేకులు గుచ్చుకున్నా ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తానని చిలుకూరుకు చెందిన నీలకంఠం అశోక్‌ తెలిపారు. నాటి ఘోర సంఘటన గురించి ఆయన మాటల్లోనే.. నేను కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం దిల్‌సుఖ్‌నగర్‌లోని భాగ్యనగర్‌ కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాను. రోజు మాదిరిగానే పేలుళ్లు జరిగిన రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఏ–1 మిర్చి బండి దగ్గర టీ తాగేందుకు వెళ్లాను. అక్కడికి వెళ్లిన రెండు నిమిషాలకే పెద్ద శబ్ధంతో బాంబు పేలింది. ఆ సమయంలో నా కాలుకు మేకులు వచ్చి కుచ్చుకున్నాయి. దీంతో నా కాలు ఎముకకు తీవ్ర గాయమైంది. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్ధంకాక బిత్తరపోయాను. అందరూ పరుగెడుతుండడంతో భయంతో నేను కూడా కొద్ది దూరం పరిగెత్తాను. ఆ తర్వాత పోలీసులు అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ 15 రోజులు చిక్సిత పొందాను. ఆ తర్వాత చిలుకూరులో మా ఇంటికి వచ్చాను. పూర్తిగా కోలుకోవడానికి ఏడాది సమయం పట్టింది. నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.50 వేల ఆర్థికసాయం అందింది. కాలి నొప్పులు పోయాయి. కానీ నేటికీ ఆ చేదు జ్ఞాపకాన్ని తలచుకుంటే ఉలిక్కిపడేవాడిని.

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన

మృతుల కుటుంబ సభ్యులు, బాధితులు

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసులో ఐదుగురు నింది

తులకు గతంలో ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్ష

సరైనదే అని మంగళవారం రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది.

ఈ ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందగా.. 13మంది గాయపడ్డారు. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఆనాటి భయానక పరిస్థితులు, పన్నెండేళ్లుగా తాము అనుభవిస్తున్న క్షోభను మృతుల కుటుంబ సభ్యులు, బాధితులు సాక్షితో పంచుకున్నారు.

కోదాడ, మఠంపల్లి : ఈ జంట పేలుళ్లలో కుమారుడిని పోగొట్టుకున్న మఠంపల్లి మండలం రామచంద్రాపురం తండాకు చెందిన మాలోతు రవీందర్‌ అనుభవాలు ఆయన మాటల్లోనే.. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నా రెండున్నరేళ్ల కుమారుడు అనిల్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం నా భార్య లక్ష్మి, కుమార్తె అర్చన, తల్లి గంగులు, మామ హతియా, తమ్ముడు రంగానాయక్‌తో కలిసి 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్‌కు తీసుకెళ్లాం. కుమారుడిని ఇన్నోవా హాస్పిటల్‌లో డాక్టర్‌కు చూపించగా మూడు నెలల తర్వాత ఆపరేషన్‌ చేస్తానని చెప్పారు. దీంతో తిరిగి ఇంటికి వచ్చేందుకు దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా గుడి వద్దకు వచ్చి బస్సు కోసం రోడ్డు పక్కన నిల్చున్నాం. సాయంత్రం సుమారు 5.45గంటలకు మేము నిలబడిన ప్రదేశానికి సమీపంలో రోడ్డు పక్కన డబ్బా కొట్ల వద్ద బాంబు పేలింది. ఏమి జరుగుతుందో తెలుసుకొనే లోపు నా కుడికాలు తెగి రక్తం వస్తుంది. మావాళ్లందరికి గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు వచ్చి మమ్ములను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నా కుడి కాలు తెగిపడడంతో పూర్తిగా కాలు తీసివేశారు. పేలుడు శబ్ధం ధాటికి నా కొడుకు అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు. మెరుగైన చికిత్స వైద్యం కోసం మమ్ములను కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ నా కుమారుడు చనిపోయాడు. మా తమ్ముడికి చెవులు వినపడడం లేదు. నా భార్య కాలికి గాయం కావడంతో సరిగ్గా నడవలేకపోతుంది. మా అమ్మ చేతి వేళ్లు రెండు తెగిపోయాయి. మామ హతియాకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆ సంఘటన గుర్తుకు వస్తే ఇప్పటికి భయం వేస్తోంది.

రూ.6లక్షల సాయమందించారు

ప్రభుత్వం నాకు రూ.6లక్షల ఆర్థికసాయం అందించింది. నా కుడికాలు తెగిపోవడంతో పూర్తిగా తీసివేశారు. జైపూర్‌ కృత్రిమ కాలును పెట్టించుకున్నాను. నాకు చికిత్సకు, కాలు ఏర్పాటుకు మొత్తం రూ.12 లక్షల ఖర్చయ్యింది. 2014లో నాకు అటెండర్‌ ఉద్యోగం ఇచ్చారు. ప్రస్తుతం కోదాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆఫీస్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. ప్రభుత్వం మాకు ఐదెకరాల భూమి ఇస్తానని చెప్పింది. నేటి వరకు భూమి ఇవ్వలేదు. నా కుటుంబానికి ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా ఐదెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలి. నా కుటుంబంతో పాటు నాలాంటి అమాయకులు అనేక మంది బలయ్యారు. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిందితులకు ఉరి శిక్ష వేయడం సరైనదే. ఆలస్యమైనా బాధితులకు కొంత ఊరట, మృతుల ఆత్మకు శాంతి కలుగుతుంది.

ఇన్నేళ్లకు న్యాయం జరిగింది

దేవరకొండ: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లలో దేవరకొండ పట్టణానికి చెందిన నక్క వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. అతడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు భవనగిరి డివిజన్‌ పరిధిలో పశుసంవర్ధక శాఖలో ఉద్యోగం చేసేవారు. విధి నిర్వహణలో భాగంగా పేలుళ్లు జరిగిన రోజు సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌లో బస్సు దిగి సమీపంలోని టీ స్టాల్‌ వద్ద టీ తాగుతూ ఫోన్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకుంటున్న తన కుమారుడితో మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా బాంబు పేలడంతో వెంకటేశ్వర్లు శరీరం ఛిద్రమై మృతిచెందారు. వెంకటేశ్వర్లు మృతి తర్వాత ఆయన భార్యకు అదే శాఖలో ఉద్యోగం కల్పించారు. వెంకటేశ్వర్లుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిందితులకు ఉరి శిక్ష విధించడంతో ఇన్నేళ్లకు న్యాయం జరిగిందని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

దివ్యాంగుడిలా మిగిలిపోయా..

నాంపల్లి: దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల ఘటన గుర్తుచేసుకుంటూనే నా ప్రాణం లేచి వస్తుంది. ఆ పేలుళ్లలో నా కాలు విరిగింది. దీంతో నేను దివ్యాంగుడిలా మిగిలిపోయాను. ఆ ఘాతుకం సృష్టించిన నిందితులకు హైకోర్టు ఉరి శిక్షను సమర్ధిస్తూ తీర్పు ఇవ్వడం సంతోషంగా ఉంది. నాకు రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం నేను ఆర్‌ఐగా మర్రిగూడెం తహసీల్దార్‌ కార్యలయంలో పనిచేస్తున్నాను.

గాయాలతో బయటపడ్డాం

నిడమనూరు: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లలో నిడమనూరు అవాస గ్రామం నర్సింహులగూడేనికి చెందిన కొండారు శ్రీనివాస్‌, రాములమ్మ దంపతులు గాయాలపాలయ్యారు. ఆరోజు భయానక వాతావరణం గురించి శ్రీనివాస్‌ మాటల్లో.. నేను ఉపాధికోసం హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తూ దిల్‌సుఖ్‌నగర్‌లోని పీఅండ్‌టీ కాలనీ నివాసముండేవాడిని. జంట పేలుళ్లు జరిగిన రోజు మా బాబు టిఫిన్‌ తీసుకురమ్మంటే టిఫిన్‌ సెంటర్‌లో దోశ ఆర్డర్‌ చేశాను. దోశ తీసుకుని నా బైక్‌ దగ్గరకు వెళ్లగానే బాంబు పేలింది. దీంతో నా కాలికి గాజు పెంకులు కోసుకుపోయాయి. నడవలేని పరిస్థితి, నా భార్య దూరంగా ఉండటంతో ఆమె కోసం వెతికాను. ఆమె దూరంగా కాళ్లకు గాయాలతో పడి ఉంది. మాకు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సుమారు రూ.50 వేలు మా సొంతంగానే ఖర్చు పెట్టుకున్నాం. మాకు ప్రభుత్వ సాయం అందితే బాగుంటుంది. ప్రస్తుతం కూడా పెట్రోల్‌ బంక్‌లోనే పనిచేస్తున్నాను.

బైక్‌ పార్కింగ్‌ చేసిన చోటే ప్రాణాలు వదిలి..

చిట్యాల: చిట్యాల మండలం తాళ్లవెల్లెంల గ్రామానికి చెందిన ఏలే రాములు దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందాడు. ఆయన జీహెచ్‌ఎంసీలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ అక్కడే నివాసముండేవాడు. ఆయనకు కుమారుడితో పాటు ముగ్గురు కుమార్తెలున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో తన బైక్‌ను పార్క్‌ చేసి చౌటుప్పల్‌లోని తన బంధువు ఇంటికి వచ్చాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో దిల్‌సుఖ్‌నగర్‌లో తాను పార్కింగ్‌ చేసిన బైక్‌ను తీసుకుంటుండగా అకస్మాత్తుగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించటంతో పాటు కుమారుడు సుధాకర్‌కు జీహెచ్‌ఎంసీలో ఉద్యోగాన్ని ఇచ్చింది. రాములు భార్య అండాలు ఇటీవల మృతి చెందింది. రాములు మృతి చెందటంతో తమ కుటుంబానికి తీరని నష్టం జరిగిందని అతడి కుమారుడు సుధాకర్‌ పేర్కొన్నాడు. పన్నెండేళ్ల తర్వాత నిందితులకు కోర్టు ఉరి శిక్ష విధించి బాధితులకు న్యాయం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు వేగంగా చేసి తీర్పులు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

కన్న కొడుకును కోల్పోయాం..

రామన్నపేట: జంట పేలుళ్ల ఘటనలో తమ కొడుకును కోల్పోయామని రామన్నపేట మండలం కక్కిరేణి మదిర గ్రామం రంగమ్మగూడేనికి చెందిన ముద్రబోయిన యాదమ్మ–శంకరయ్య దంపతులు అన్నారు. వీరివారి రెండో కుమారుడు మత్స్యగిరి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆనంద్‌ చాయ్‌ సెంటర్‌లో పనిచేసేవాడు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌లో మృతి చెందాడు. మత్స్యగిరికి అన్న స్వామి, తమ్ముడు అంజనేయులు ఉన్నారు. మత్స్యగిరి మృతి అనంతరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రూ.6లక్షల ఎక్స్‌గ్రేషియా, 160 గజాల ఇంటి స్థలం ఇచ్చారు. మత్స్యగిరి సోదరుడు స్వామికి భువనగిరి సీపీఓ కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. నిందితులకు శిక్ష పడటం ఆనందంగా ఉందని యాదమ్మ, శంకరయ్య పేర్కొన్నారు.

షాపింగ్‌కు వెళ్లి పేలుళ్లలో

చిక్కుకున్నాం

మోతె: తన స్నేహితులతో కలిసి 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌ ఏరియాలో షాపింగ్‌ చేసి బయట వచ్చి పేలుళ్లో చిక్కుకున్నామని మోతె మండలం హుస్సేనాబాద్‌ గ్రామానికి చెందిన రావుల హుస్సేన్‌ అన్నారు. ఆయన మాటల్లోనే.. ఆ రోజు షాపింగ్‌ పూర్తిచేసి రోడ్డు మీదకు వచ్చే వరకు పెద్ద శబ్దంతో బాంబులు పేలాయి. నా ఎడమ చేతికి గాజు పెంకు గుచ్చుకొని రక్తం కారుతుండగా నా ఫ్రెండ్స్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ ఘటనకు పాల్పడిన సంఘ వ్యతిరేక శక్తులను ఉరి తీయడం నాకు సంతోషంగా ఉంది. తప్పు చేసిన వారికి ఎప్పటికై నా శిక్ష పడాల్సిందే.

కోర్టు తీర్పు హర్షణీయం

పెద్దఅడిశర్లపల్లి: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనపై కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ తీర్పు ఉపకరిస్తుంది. ఆనాడు బాంబు పేలుళ్ల ఘటన సమయంలో నేను బీటెక్‌ ఫైనలియర్‌ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాను. రోజు మాదిరిలాగే ఆరోజు సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి బండి దగ్గర టీ తాగేందుకు వెళ్లాను. టీ తాగుతున్న సమయంలో పెద్ద శబ్ధంతో బాంబు పేలింది. దీంతో నా కాలు విరగడంతో పాటు బలమైన గాయం అయ్యింది. అక్కడ ఏం జరుగుతుందో ఏమి అర్ధం కాని పరిస్థితుల్లో నన్ను ఆటోలో సమీప ఓమ్నీ ఆస్పత్రిలో చేర్పించి నెల రోజుల పాటు వైద్యం అందించారు. నా వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే చెల్లించింది. ప్రస్తుతం నేను అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాను.

భయాందోళనకు గురయ్యా..

నేరేడుచర్ల: మాది నేరేడుచర్ల మండల కేంద్రం. నేను హైదరాబాద్‌లోని మలక్‌పేట సిరిపురం కాలనీలో నివాసముండేవాడిని. నా స్నేహితుడు టీవీ చారి కుమారుడు ఈశ్వర్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉండగా.. అతడికి డబ్బులు ఇచ్చేందుకు దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు జరిగిన రోజు వెళ్లాను. డబ్బులు ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. బాంబు పేలుళ్లు జరిగాయి. ఆనాటి పేలుళ్లలో నా ఎడమ కాలు విరగడమే కాకుండా.. కాలులోకి సైకిల్‌ చర్రాలు కుచ్చుకుపోయాయి. యశోదా ఆస్పత్రిలో కాలుకు ఆపరేషన్‌ చేసేందుకు 8గంటల సమయం పట్టింది. ఆ సమయంలో చాలా భయాందోళనకు గురయ్యాను. ప్రభుత్వం నుంచి వైద్య ఖర్చుల కోసం రూ.లక్ష సాయం అందించారు. ప్రస్తుతం కుటుంబంతో హైదరాబాద్‌లోనే నివాసముంటున్నా.

బస్సు ఆలస్యంతో బాధితుడినయ్యా..

భూదాన్‌పోచంపల్లి: బస్సు ఆలస్యం కావడంతో దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటనలో బాధితుడిని అయ్యానని భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లికి చెందిన సుక్క లింగస్వామి ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు..

నేను ప్రతిరోజు పెద్దరావులపల్లి నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌లోని నాగోల్‌కు వెళ్లి ప్రైవేట్‌ జాబ్‌ చేస్తుండేవాడిని. 2013 ఫిబ్రవరి 21న కూడా జాబ్‌ పూర్తయ్యాక ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌కు వచ్చాను. పోచంపల్లి బస్సు ఆలస్యం ఉందని తెలిసి స్నేహితుడి సిమ్‌ కార్డు యాక్టివేషన్‌ చేయించడానికి సాయంత్రం 6.40 గంటలకు కోణార్క్‌ థియేటర్‌ సమీపంలో మొబైల్‌ షాపు వద్దకు వెళ్లాను. అదే సమయంలో మొదట వెంకటాద్రి థియేటర్‌ బస్టాప్‌లో బాంబు పేలుడు జరిగడంతో ప్రజలంతా పరుగెత్తుతున్నారు. వెంటనే కోణార్క్‌ థియేటర్‌ పక్కనే ఉన్న టీస్టాల్‌ వద్ద కూడా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి పొగ కమ్ముకొని దారి కన్పించక భయానక వాతావరణం ఏర్పడింది. చిన్నచిన్న ఇనుప ముక్కలు నా వీపు, భుజం, కాళ్లలో దిగాయి. అలాగే పరిగెడుతూ రన్నింగ్‌ బస్సు ఎక్కి ఎల్‌బీనగర్‌లో బంధువుల ఇంటికి వెళ్లాను. అనంతరం ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నాను. అదేరోజు రాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకుని మా అమ్మ, బంధువులకు మాత్రం నేను సురక్షితంగా ఉన్నానని చెప్పాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత గాయపడిన నన్ను చూసి మా అమ్మ ఏడ్చింది. అనంతరం నిమ్స్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకొన్నాను. నా అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డానని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇప్పటికీ దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లినపుడల్లా నాటి పేలుళ్ల ఘటన గుర్తుకొచ్చి నాకు పునర్జన్మ లభించిందని భావిస్తాను.

ఉరి శిక్ష సరైనదే..1
1/11

ఉరి శిక్ష సరైనదే..

ఉరి శిక్ష సరైనదే..2
2/11

ఉరి శిక్ష సరైనదే..

ఉరి శిక్ష సరైనదే..3
3/11

ఉరి శిక్ష సరైనదే..

ఉరి శిక్ష సరైనదే..4
4/11

ఉరి శిక్ష సరైనదే..

ఉరి శిక్ష సరైనదే..5
5/11

ఉరి శిక్ష సరైనదే..

ఉరి శిక్ష సరైనదే..6
6/11

ఉరి శిక్ష సరైనదే..

ఉరి శిక్ష సరైనదే..7
7/11

ఉరి శిక్ష సరైనదే..

ఉరి శిక్ష సరైనదే..8
8/11

ఉరి శిక్ష సరైనదే..

ఉరి శిక్ష సరైనదే..9
9/11

ఉరి శిక్ష సరైనదే..

ఉరి శిక్ష సరైనదే..10
10/11

ఉరి శిక్ష సరైనదే..

ఉరి శిక్ష సరైనదే..11
11/11

ఉరి శిక్ష సరైనదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement