
విద్యార్థులపై ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ
యాదగిరిగుట్ట: విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తుందని బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు, యువతకు కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని విమర్శించారు. పేద విద్యార్థులకు రూ.5లక్షల రుణాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేబినెట్‌లో ఆ విషయాన్ని ప్రసావించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థుల హక్కులు సాధించేలా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువతది కీలకపాత్ర అన్నారు. 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు ఒగ్గు శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్‌రెడ్డి, ఆలేరు నియోజకవర్గ కన్వీనర్ ర్యాకల రమేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాసాల ఐలేష్‌యాదవ్, కొంపల్లి నరేష్, పల్లె సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు
గెల్లు శ్రీనివాస్‌యాదవ్