
ఆగని ఇసుక దందా !
మూసీ, పాలేరు వాగుల నుంచి అక్రమంగా రవాణా
చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం
అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేసేందుకు వాడపల్లి, సల్కునూరు, వేములపల్లి, యాద్గార్‌పల్లి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. అన్ని చెక్‌పోస్టుల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచాం. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. నాలుగు నెలల్లో 28 వాహనాలను పట్టుకుని సీజ్ చేశాం. ప్రజలు కూడా సహకరించాలి.
– పీఎన్‌డీ.ప్రసాద్, మిర్యాలగూడ రూరల్ సీఐ
మిర్యాలగూడ: మిర్యాలగూడ ప్రాంతంలో ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. కొందరు వ్యాపారులు నిబంధలనకు విరుద్ధంగా ఈ వ్యాపారం సాగిస్తూ రూ.లక్షలు అర్జిస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలోని మూసీ, పాలేరు వాగుల నుంచి ఇసుక అక్రమంగా మిర్యాలగూడ ప్రాంతానికి తరలివస్తోంది. ఈ దందాకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.
వంగమర్తి టు మిర్యాలగూడ..
జిల్లాలోని శాలిగౌరారం మండలం వంగమర్తి నుంచి మిర్యాలగూడ నియోజకవర్గానికి ఇసుకను రోజూ పదుల సంఖ్యలో భారీ టిప్పర్లతో తరలిస్తూ దందా సాగిస్తున్నారు. ఇటీవలే ఇసుక లోడ్‌లతో వస్తున్న టిప్పర్‌ను మిర్యాలగూడ లారీ అసోసియేషన్ సభ్యులు పట్టుకుని ఎంవీఐకు సైతం అప్పగించారు. దీంతో అధిక లోడ్ ఉండడంతో మిర్యాలగూడ ఎంవీఐ వీరస్వామి కేసు నమోదు చేశారు. అయినా వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో థర్మల్ ప్లాంట్‌లో నిర్మాణాలు, బీబీనగర్ – నడికుడి రైల్వే రెండవ వరుస నిర్మాణ పనులు, ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నారు. ఇదే అదనుగా అభివృద్ధి పనుల పేరిట ఇసుక దందా కొనసాగుతోంది.
బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు..
మిర్యాలగూడ నియోజకవర్గంలోని రావులపెంట, తక్కెళ్లపాడు ఇసుక రీచ్‌లలో రూ.3,100కే నాలుగు టన్నుల ఇసుక లభించేంది. అయితే గతంలో వర్షాలు కురిసిన సమయంలో ఇక్కడ ఇసుక బుకింగ్‌కు అనుమతించలేదు. సైట్ కూడా పనిచేయకపోవడంతో స్థానికులకు ఇసుక అందని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగమర్తి, పాలేరు ప్రాంతాల నుంచి ఇసుకను టిప్పర్ల ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నారని వినియోగదారులు అంటున్నారు. దీంతో నిరుపేద, మధ్య తరగతి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఇసుక రూ.4వేల నుంచి రూ.5వేల వరకు ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పటికై నా మైనింగ్ శాఖ అధికారులు స్పందించి ఆన్‌లైన్ ఇసుక సైట్ తెరిపించి ఇసుక ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సరఫరా చేయాలని మిర్యాలగూడ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
పట్టుబడుతున్న ఇసుక ట్రాక్టర్లు..
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో మాడ్గులపల్లి, వేములపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్వలపాలెం, భీమనపల్లి పాలేరువాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 27 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ బాపట్ల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక లారీని దామరచర్ల మండలం వాడపల్లి పోలీసులు పట్టుకు కేసు నమోదు చేశారు.
ఫ అభివృద్ధి పనుల పేరుతో వంగమర్తి నుంచి టిప్పర్ల ద్వారా తరలింపు
ఫ మిర్యాలగూడలో జోరుగా విక్రయాలు
ఫ అధిక ధరలకు కొంటున్న పేద,
మధ్యతరగతి ప్రజలు

ఆగని ఇసుక దందా !

ఆగని ఇసుక దందా !

ఆగని ఇసుక దందా !